పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంకా యితర ప్రసిద్దాంగ్లరచయితలు కూడా నిషేదింపదగినవా రగుదురు. అన్నియు నట్లుండ బైబిల్ లోని పూర్వభాగములో (old testament) కావలసినన్ని బూతులున్నవి. అది ఇంటింట నుండు గ్రంథము” ఇంగ్లండులో అమెరికాకవియగు వాల్టు విట్మన్ కవితను ఫ్రెంచిరచయితయగు ఎమిలి జోలా రచనలను (ముఖ్యముగా 'నానా'యను నవలను) ఫ్లాబర్ట్ యొక్క మేడం బవరీ నవలను నిషేధింపఁజూచిరి. ఇప్పుడిప్పుడు అమెరికాలోని హార్వర్డు, కొలంబియా విద్యాపీఠాలలోను, కొన్ని కాలేజీలలోను, సాహిత్యవిజ్ఞానార్థమై 'డెకామరన్' పుస్తకాన్ని పాఠ్యగ్రంథముగా నిర్ణయించుచున్నారు. ఇట్టి డెకామరన్ లోని ఒక కథను పూర్తిగా పోలినట్టికథ శుకసప్తతిలో కలదు. డెకామరన్ లో పదవదినమందలి నాల్గవకథతో శుకసప్తతిలోని ఎనిమిదవకథ సరిపోలినది. డెకామరన్ లో ఏడవదివసపు పదికథలన్నియు కాముకులు చిక్కులలో నిరికి సమయస్ఫూర్తిచేఁ దప్పించుకొన్న శృంగారకథలు. అట్టి విధానముకలవే శుకసప్తతిలోని అత్యధికకథలు. శుకసప్తతికథలు ఱంకుపోయి బొంకాడినకథలని ప్రచారము మొదలైనతర్వాత అందఱును అదే ధోరణిలో పడిరి. ఈ గ్రంథమునుకాని, ఇందలి కొన్ని కథలనుగాని పాఠ్యగ్రంథాలలోని సంకలనములలో చేర్చరైరి. పిల్లలమఱ్ఱి పినవీరన, అయ్యలరాజు రామభద్రుఁడు, కూచిమంచి తిమ్మకవి, కంకంటి పాపరాజు, కుమ్మరి మొల్ల, గట్టు ప్రభువు, సంకుసాల రుద్రకవి, మున్నగువారి కిచ్చిన స్థాన మైనను కదిరీపతి కియ్యలేదు. యథార్థముగా ఉత్తమకవులశ్రేణిలో కదిరీపతి చేరునట్టివాఁడు.