పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84 శుకసప్తతి

గావించి సన్మంత్రిమంత్రాలోచనంబునఁ బ్రవీణుండై యేకాతపత్రప్రభావంబుఁ గాంచి ద్వివిధవిరోధిశిక్షాదక్షుండయి శక్తియాలవాలుం డగుచుఁ జతురుపాయసామర్థ్యంబునుం గలిగి పంచతంత్రంబులమర్మంబు లెఱింగి షడ్గుణైశ్వర్యధుర్యుండన వెలసి సప్తవ్యసనంబుల వర్జించి యష్టభోగంబులకుం దగిన నవనిధానంబుల భాండాగారంబులు నియమించి పదిం బదియుఁగా రాజ్యపరిపాలనంబు సేయునతండు పార్థివరత్నం బండ్రు, కావున నీ వేతద్విధంబునం బ్రవరిల్లు మని మఱియు ని ట్లనియె. 339

చ. ఇది మొద లింక నెం దయిన ని ట్లొకరుండవుఁ బోకు పోయిన
న్మదనమనోహరాంగ మణిమండన నీగురవాన యంచుఁ బ్రే
మదొరల విన్నవించి నృపుమన్నన గాంచి యతండు వోవ న
య్యదనునఁ బ్రాగ్వియోగబల మవ్విభునిం గని చేరి మ్రొక్కినన్. 340

క. అందఱఁ గృపార్ద్రవీక్షా
మందరుచిం గప్పుకొని యమానుషమహిమం
జెంది ముదమంది రాజపు
రందరుఁ డతఁ డూరుసేరె రాజీవముఖీ. 341

తే. అని శుకాధ్యక్షుఁ డీరీతి నద్భుతైక
గాథ వివరింప నంతలోఁ గమలబంధుఁ
డుదయపర్వతశిఖరాప్తిఁ బొదల నంతి
పురవరంబున కరిగె నప్పువ్వుఁబోఁడి. 342