పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమగ్రముగా శుకసప్తతి లభించినది. అందుకు శ్రీ శాస్త్రిగారికి ఆంధ్రలోకము కృతజ్ఞతాబద్దమైనది. ఇదివరలో ముద్రితమైన ప్రతిలో ఉపకథలతో సయితము మొత్తము 31 కథలుకలవు. వీటికి 45 రాత్రులుపట్టినట్లు లెక్కించిన తెలియవచ్చెడి. ఎటుచూచినను 70 సంఖ్య పూర్తికాలేదు. నాల్గవయాశ్వాసములో 127 పద్యములే లభించియుండెను. ఇప్పుడు నాల్గవయాశ్వాసము ఇంచుమించు పూర్తిగా లభించినది. 70 రాత్రులవఱకు కథ పెరిగినది. దీనినిఁబట్టి సప్తతియనిన 70 కథలు కాదనియు 70 రాత్రులని స్పష్టమైనది.

ఈశుకప్తతికథలు ఱంకుపోయి బొంకాడినకథలనియు, అందుచేత స్త్రీలు బాలురు, శిష్టులు, చదువరానట్టివనియు, ఇట్టి పచ్చిశృంగారము గర్హ్యమనియు తెనుఁగుసాహిత్యచరిత్రకారులు, విమర్శకులు, ఆక్షేపించుచు వచ్చినారు. ఇది విచారకరము, ఈకథలలో 1వ, 4వ, 11వ, 15వ, 20వ కథలో మొదటి యుపకథ, అయిదవ యుపకథ, ఆఱవ యుపకథ, మొత్త మేడుకథలు ఱంకుబొంకులు లేనివై శిష్టులు చదువదగినవైయున్నవి. అట్టివారికొఱకు వీటిని కృత్యాదిపద్యములతో జేర్చి వేరుగా శిష్ట ప్రతి నొకదానిని ముద్రింపవచ్చును. తక్కినకథలలో ఱంకుముచ్చట్లున్నను కవి యెచ్చటను నసహ్యమగునట్టి, లేక జుగుప్సాకరమగునట్టి, వర్ణనలను జేయ లేదు. శ్రీనాథుని శృంగారనైషధములో, హరవిలాసములో, సారంగు తమ్మయ వైజయంతీవిలాసములో, క్రీడాభిరామములో, కూచిమంచి తిమ్మకవికృతులలో, బహుప్రబంధకవుల సంభోగవర్ణనలలో నుండిన పచ్చిశృంగార మిందు లేనే లేదు.