పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది



ఉపోద్ఘాతము

కవికాలము

శృంగారకథలను శుకసప్తతియను పేరుతో, మనోహరమగు సుందరశైలితో, ఆహ్లాదకరమగు వర్ణనలతో, అడుగడుగునకు నవ్వించు సన్నివేశములతో, రచించిన యసాధారణ కవియగు కదిరీపతిని గురించి కాని యాతనిగ్రంథమునుగురించి కాని నేఁటివఱకు మనకు సమగ్రముగాఁ దెలియకుండుట యత్వంతవిచారకరము. ఇంచుమించు ౩౦౦ ఏండ్లక్రిందటిగ్రంథమే మసకు పూర్తిగా లభింపకపోవుట మన దురదృష్ట మనవలెను. ౧౯౦౯ లో మొదటిసారి దొరికినంతవఱకు ముద్రించినప్పుడు కృత్యాదిపద్యము లేవియు లభించియుండ లేదు. అట్టిసందర్భమందు ౧౯౨౧ లో నేను, మద్రాసులో ఇప్పటి ప్రధానన్యాయమూర్తులును, అప్పటి ఎఫ్. ఎల్, విద్యార్థులునునగు శ్రీపీ. వీ. రాజమన్నారుగారిసంపాదకత్వమున వెలువడు “కళ” యను మాసపత్రికలో శుకసప్తతిని గురించి వ్యాసము వ్రాసినప్పుడు ఆందలి కొన్నివర్ణనలనుబట్టి యా గ్రంథము క్రీ. శ. ౧౬౦౦౼౧౬౫౦ ప్రాంతమందు రచింపబడినదని వ్రాసియుంటిని. గ్రంథములో పరంగివారు, ఇంగిలీసులు, వారి "ముఖాములు” మున్నగునవి పేర్కొనబడినందున ఇంగ్లీషువారు. క్రీ.శ.౧౬౦౦ నుండియే మన దేశముస వ్యాపార మారంభించియుండినందున కవికాలము నావిధముగా నిర్ణయించియుంటిని. తర్వాత