పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


[1]వికలతారకచక్రవిభ్రాంతిభీషణ-
          స్ఫారచక్షుర్ద్వయీభయద మగుచు
[2]నిటలవీథివిటంకనిర్భరభ్రూకుటీ-
          నటనక్రియాటోప[3]పటహ మగుచు


గీ.

గాలమృత్యువు శాణచక్రమునఁ బట్టి
చికిలిచేసిన యడిదంబుఁ జేతఁ దాల్చి
జేగుఱించిన మొగముతోఁ జిత్తజారి-
ప్రమథవర్గంబుఁ దాఁకె నాగ్రహ మెలర్ప.

78


వ.

ఠవణి[4]ఠమరువు ఠమఠమనినదము ఠవణించుచుఁ దచ్చటుల(తర)[5]ఠమామీఠడంబరవిష్కంభము కాష్ఠాకటాహముల నుద్ఘాటింప దినకరకరచ్ఛాయాచ్ఛేదాధిగమమున ధగద్ధగితములగు నిస్త్రింశకుఠారాద్యాయుధదీప్తులు రణలక్ష్మి నివాళింపంగ నపుడు విద్యాధరపన్నగయక్షగరుడగంధర్వాదులు మది నాహ్లాదింపంగ సురముని [6]కుంచె యాడింపంగ నిలింపపదమున భవునిలెంకలు శమనకింకరులును బాహావష్టంభవిజృంభణ మప్రతిహతముగ నొండొరువులఁ దాఁకిన భండనంబు ఘోరంబయ్యెను.

79


క.

శంకరభటులును నంతక-
కింకరులు మిథఃప్రహార[7]కీలాలసటా-
పంకిలతనులయి కుసుమిత-
కంకేలీతరుల భంగిఁ గనుపట్టి రనిన్.

80


వ.

అప్పుడు కింకరులయం దొక్కరుండు యముని సన్నిధికిం జని [8]యతని కిట్లనియె.

81


సీ.

దేవ దేవర యాజ్ఞధృతి [9]నేము దలఁబూని
          మృత్యుతోఁ గూడి భూమీస్థలమున
[10]కరిగి వణిక్పథమను పట్టనమునకు
          ననతిదూరమున శైలాంతరమున
నడవిలో నొక మృగవ్యాధపక్కణమునం
          [11]దరిగి గేహమున గుష్ఠామయమునఁ
జెడిపెకూఁతురు కాళ్ళకడనుండి యేడ్వంగఁ
          బంచత్వ మొందిన పాపకర్ము


గీ.

బ్రహ్మబంధుని సుకుమారుఁ బట్టి [12]తేఁగ
నభవుదూతలు [13]రానీక యాఁగినారు
మాకు వారికి దురమయ్యె నాకసమున
నెఱుఁగఁ జెప్పంగ వచ్చితి నిత్తెఱంగు.

82


వ.

అనిన *(విని) కృతాంతుండు సమధికక్రోధావేశవివశస్వాంతుండై యులుంబరుండను సేనాని రావించి యతనితో నిట్లనియె.

83


గీ.

చను ములుంబర వృషభలాంఛనుని లెంక-
లాఁగినారఁట మనవాండ్ర నాకసమున
నొక్కపాపాత్ముఁ గొనిరాఁగ నుద్దవిడిని
నేఁగి యా జటాధారుల నెగిచి రమ్ము.

84
  1. తా. వికట
  2. తా. నిటలభేరి
  3. తా. లటహ
  4. తా. డమరువు ఢమఢమ
  5. తా. డమా విరడవాడంబర నిరష్కంధము
  6. తా. కుంచియ
  7. తా. కృతరుధిరపటా
  8. తా. యతనితో నిట్లనియె
  9. తా. తోడఁ
  10. ము. ఁజని వణిక్పథమను ఘనపట్టనమునకు
  11. ము. గుష్ఠామయంబునఁ గుతిలపడఁగ
  12. తా. తేర
  13. తా. రాకుండ నాఁగినారు