పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నొచ్చిననేమి పండ్లుచెవినోరు కరాంగుళి నేత్రగోళముల్
ముచ్చికనేమి [1]పట్టువడి [2]మొక్కిలి బంధనశాలలోనికిన్
వచ్చిననేమి భృత్యునకు [3]నచ్చిన యేలిక యాజ్ఞపట్టునన్.

72


గీ.

తగవు ధర్మంబుఁ పాడి పంతంబు దెలిసి
యనుపుఁ డీ బ్రాహ్మణుని బాధ లనుభవింప
నొండె దురమున మమ్ము మృత్యువు జయించి
విప్రుఁ గొనిపొండు మాటలు వేయునేల.

73


క.

మీకును మీ పతియానతి
మాకును మా భర్తయాజ్ఞ మన్నింపఁదగున్
[4]వాకోవాక్యమ్ముల వెడ
వాకాట్లం బల్బజంబు వలవదు సేయన్.

74


క.

అని యమునిభటులు పలికిన
విని శంకరభటులు తద్వివేకంబునకున్
మనమున సంతోషించియు
[5]మనసిజహరు శాసనమును మన్నించుటకై.

75


సీ.

పొడికచ్చడములపైఁ బులితోలు నునుసేలు
          కటిభారమునఁ గాసెకట్టు గట్టి
యభినవంబైన రుద్రాక్ష యొడ్డాణంబు
          నాభిచక్రములోనుగా భరించి
ప్రిదిలి జాఱకయుండఁ బెనుఁబాఁప[6]ప్రోఁగులు
          [7]శ్రవణభాగమునందు సంతరించి
యల్లిబిల్లిగ జటావల్లీమతల్లులు
          గూర్చి పెంపొందఁ గీల్కొప్పు వెట్టి


గీ.

భసితధూళిశరీర మధ్యంగమార్చి
యుద్దవిడిఁ బారిషదయోధు లొక్కఁడొకఁడ
యాయుధంబులు ధరయించి యట్టహాస-
డమరుకధ్వాన సింహనాదములతోడ.

76


శా.

ఆటోపారభటీసముద్భటతరాహంకారబాహాధను-
ర్జ్యాటంకారరవంబు లంబుజభవాండాభ్యంతరంబున్ సమా-
స్ఫాటింపంగ లలాటలోచనభుజిష్యుల్ దండభృద్భృత్యుల
ధాటీసంభ్రమలీలఁ దాఁకిరి వడిన్ ధారాధరాధ్వంబునన్.

77


సీ.

ద్రాఘిష్ఠకఠినదంష్ట్రాదండసంఘట్ట-
          కటుఘోరకిటకిటాత్కార మగుచుఁ
జటులఝంఝామరుజ్ఝంపాపరంపరా-
          సన్నిభఘ్రాణనిశ్వాస మగుచు

  1. ము. పట్టపతి
  2. తా. మొక్కిలి
  3. తా. వచ్చిన
  4. తా. వాకోపవాక్యముల
  5. తా. మనసిజహరు శాసనమున
  6. తా. ప్రొగ్గళ్ళు
  7. తా. శ్రవణపాశమునందు