పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


బెంతయుఁ గల్గియున్ సరసిజేక్షణ [1]విన్నఁగఁబోయియుండు సీ-
మంతిని బోటికత్తెలకు మానసవృత్తి యెఱుంగఁ జెప్ప కై-
[2]కాంతికకేళిశయ్యపయిఁ గాంత గుణించు మనోరథార్థముల్.

19


ఉ.

[3]ఆ చపలాయతాక్షి కనకాంబురుహంబులఁ [4]బూజ సేయు విం-
ధ్యాచలకందరానిలయు నద్రిసుతాప్రియనాథు నర్మదా-
వీచిపరంపరాసలిలవిప్రుషదాశ్రయశీతగంధవా-
హాచమనప్రవృద్ధభుజగాధిపకంకణు నోంకృతీశ్వరున్.

20


సీ.

అభిషేక మొనరించు నలినీలకుంతల
          శంభు సోమోద్భ[5]వాసలిలధార
నెలఁత యభ్యర్చించు నీలోత్పలంబులఁ
          దరుణనిర్మలసుధాధామమౌళి
గరళకూటగ్రాసకల్మాషకంధరు
          మేన గంధ మలందు మీన[6]నేత్ర
యర్పించు దివ్యోపహారంబు లెలనాఁగ
          కుటిల[7]కుండలిరాజకుండలునకు


గీ.

నతివ దిరుగుఁ బ్రదక్షిణం బభవు [8]గుడికి
గుచభరంబున నరగౌను [9]గూనుగిలఁగ
[10]రవలిమట్టెల మ్రోతతో రాయిడింపఁ
జరణనూపురఝళఝళంఝళరవంబు.

21


వ.

ఒక్కనాఁ డోంకారనాథునకుఁ బ్రదక్షిణం బాచరిం[11]చుచు నప్పద్మాక్షి ప్రాకారపురఃప్రఘాణంబున నొక్క పౌరాణికుండు శ్రీమహాభారతంబు వక్కాణించు వాఁ [12]డపుత్రకులకుఁ బుణ్యలోకంబు లేదని కథానుకథనప్రసంగంబునం బలికిన నయ్యింతి సంతానవిరహవేదనాదూయమానమానసయై మందిరంబున కేతెంచి యేకాంతభవనంబున [13]విహారశయ్యపై మేనువైచి చింతాక్రాంతయై యుండె నంత యజ్ఞదత్తుం డమ్మత్తకాశిని నన్వేషించి.

22


ఉ.

కాంత సరోజనాళలతికాతనుపాండుశరీరయష్టి నే-
కాంతగృహాంతరస్థితఁ బ్రియాంగనఁ జేరఁగవచ్చె మంత్రి క-
ల్పాంతమునన్ రసాతలగుహాకుహరంబున [14]డాఁగియున్న భూ-
కాంత వరాహమూర్తి హరి గ్రచ్చఱ డాయఁగవచ్చు కైవడిన్.

23


వ.

డాయవచ్చినఁ గృతప్రత్యుత్థానయగు నప్పంకజాక్షియుఁ దానునుం పర్యంకంబునఁ గూర్చుండి

  1. ము. చిన్నగ
  2. ము. కాంతమ
  3. తా. ఆ చపలాక్షి దాను
  4. తా. బూని
  5. తా. వ
  6. తా. నేత్రి
  7. తా. కుంతలి
  8. తా. నకును
  9. తా. గూనిగిలఁగ
  10. తా. రవణి
  11. తా. పుచు
  12. తా. అపుత్రులైనవారలకు
  13. ము. విరహశయ్యపై
  14. తా. డస్సియున్న