Jump to content

పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


వ.⁠

ఇవ్విధంబునఁ బ్రళయసలిలోపద్రవం బు[1]డిపి ధాత్రిఁ [2]బూర్వస్థానంబున సంస్థాపించి సర్వసర్వంసహాభార*(వహనం)బునం బ్రభవించిన ప్రయాసఖేదం బుజ్జగించుట[3]కయి పాఁపసెజ్జపై మున్నీటి నట్టనడుమం బవ్వళించి నారాయణుడు నిజాంతర్గతంబున.

⁠ 72


శా.⁠

దుర్వారోద్యమభంగి దంష్ట్రికతుదిన్ దూరంబుగా [4]నెత్తి యేఁ
బూర్వస్థానమునందుఁ బెట్టితి యథాపూర్వంబుగా నిప్పుడీ
యుర్వీమండలి నెట్టివాఁడనొకొ యోహోయంచుఁ జిత్తంబునన్
గర్వించెన్ మధుకైటభాంతకుఁ డు[5]దన్వద్వారిమధ్యంబునన్.

⁠ 73


గీ.⁠

అంత నిటఁ దానతానగు నబ్జభవుఁడు
దంభ[6]కోలావతారుఁడు ధాత్రి [7]యెత్తఁ
జాగెఁ బ్రారబ్ధమార్గానుసారమునను
మొదలుకొని యెల్ల విష్టపములు [8]సృజింప.

⁠ 74


వ.⁠

[9]మహత్సర్గంబు *(భూతసర్గంబు వైకారికసర్గంబును నను) బుద్ధిపూర్వకంబులగు మూఁడును బ్రాకృతసర్గంబులు; ముఖ్యసర్గంబు, తిర్యక్సర్గంబు, దేవసర్గంబు, మానుషసర్గంబు, గ్రహసర్గంబును నా [10]నైదును బుద్ధిపూర్వకంబులు వైకృతసర్గంబులు; కౌమారసర్గంబు ప్రాకృతసర్గంబు. ఈ తొమ్మిదియు నసాధకంబులు సాధకత్వంబును నైహికాముష్మికహితాహిత తదుపాయ తత్ప్రతికారవిరహితంబునం జేసి [11]యప్రయోజనంబులగుట నీ తొమ్మిది సర్గంబులవలనను బ్రయోజనంబు గానక కనకగర్భుండు మహేశ్వరునిం బ్రస్తుతించి తత్ప్రసాదంబునం బురాణప్రజాపతుల *(కశ్యప)మరీచిభృగ్వాంగిరస పులస్త్యపులహక్రతుదక్షవసిష్ఠుల మానసంబునం దొమ్మండ్రను ధర్మాధర్మసంకల్పంబుల మూఁటినిఁ గూడఁ బన్నిద్దఱు పుత్రులఁ గాంచె. ఆ పన్నిద్దఱవలననుం బండ్రెండు దివ్యవంశంబులు ప్రజావంతంబులుఁ గ్రియావంతంబులునై ప్రవర్తిల్లె; నందు *(దేవ)దైత్యదానవముని యక్షగరుడగంధర్వ కిన్నరకింపురుష సిద్ధవిద్యాధర కర్మదేవతాప్సరఃకామినీ రక్షోభూతపిశాచ మనుష్య పశుపక్షిమృగోరగకీటక గిరిగ్రావ వృక్షలతాగుల్మాదులును, గాయత్రీ త్రిష్టుప్సామరథంతరంబులును, అగ్నిష్టోమహయమేధ వాజపేయాతిరాత్ర పౌండరీకాదులు లోనుగా గలుగు చరాచరంబులు ప్రాజాపత్యాంగోపాంగప్రత్యంగంబుల జన్మించె; నివ్విధంబున నఖిలప్రపంచంబు నిర్మించి విరించి నిజాంతర్గతంబున.

⁠ 75


ఉ.⁠

ఏ నధికుండ నాకుఁ బ్రతి యెవ్వరు నిర్జరకోటిలోన నేఁ
[12]గాని జగత్ప్రపంచపరికల్పన సేయఁగలేఁడు తక్కొరుం
డే నఖిలేశ్వరుండనని యెవ్వరునుం బ్రతికోటిలేమిఁ దాఁ
దాన యహంకరించెను విధాత సదా[13]శివు మాయపెంపునన్.

⁠ 76


వ.⁠

ఇవ్విధంబున నవష్టంభంబు గైకొని యంభోరుహసంభవుండు తాను సృజియించిన భువన(భవనం)బులు వీక్షింపందలంచి రాయంచ[14]తే రెక్కి దిక్కులఁ జరించువాడు ముందట.

⁠ 77
  1. ↑ ము. ఁదీర్చి
  2. ↑ తా. నుద్ధరించి
  3. ↑ తా. నై
  4. ↑ ము. నైతి
  5. ↑ తా. హృద్యద్వారి
  6. ↑ ము. క్రోడావతారుఁడై. తా. కోలావతారుఁడై
  7. ↑ ము. యెత్తి, సాగె
  8. ↑ తా. సృజించె
  9. ↑ తా. మహత్సర్గంబు నాను
  10. ↑ ము. నేడును
  11. ↑ తా. నిష్ప్ర
  12. ↑ తా. గాన
  13. ↑ తా. శివ
  14. ↑ తా. నెక్కి