పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మహాస్రగ్ధర.

అటఁ గాంచెం [1]బద్మగర్భుం డహిమకరఢులీహస్తినక్రాది యాదః-
పటలీధాటీవిహారప్రచలిత మహిభృత్పక్షవిక్షేపలీలా-
[2]చటులోర్మివ్యాప్తఘోషా సముపచితదిశాసౌధవీథీవిటంకా-
వటుసంఘాటాప్రతిశ్రు[3]ద్భయకలితజగద్వ్యా ప్తి లబ్ధిన్ సుధాబ్ధిన్.

78


లయగ్రాహి.

తోయజభవుండు మదిఁ బాయని యహంకరణ-మాయ[4]ను జగంబు[5]ల కపాయము ఘటింపం
జేయ సమకట్టి ఫణిశాయి నిరుపాధి శుభ-దాయకు సురాసురనికాయమకుటా[6]గ్ర-
స్థాయి కురువిందసముదాయఘృణి[7]కోటివిశ-దాయతపదద్వయుఁ గళాయుతుని శ్రీనా-
రాయణు రమారమణు డాయఁ జని నిద్దురకు రాయిడిగ నెవ్వఁడవురా! యనుచుఁ బల్కెన్.

79


క.

లేలెమ్మెక్కడివాఁడవు
పాలసముద్రమున భోగిపర్యంకమునం
దేలెద వొక్కండవు [8]ననుఁ
ద్రైలోక్యాధీశు [9]నెఱుఁగుదా పరమేష్ఠిన్.

80


సీ.

పాతాళభువనసప్తకము నిర్మించితి
          వానితి విశ్వవిశ్వంభరయును
దిక్చక్రవాళ మెత్తితిఁ జక్కఁజేయఁగాఁ
          [10]బాఁతుకొల్పితి గోత్రపర్వతముల
వరుసఁ దీర్చితి నేడు శరనిధానములకు
          నారు వోసితి నరణ్యములు పెక్కు
గ్రహతారనక్షత్రగతు లేఱుపఱిచితి
          సరణు లేర్చితి నభస్వంతమునకుఁ


గీ.

గదియఁ గూర్చితి బ్రహ్మాండకర్పరంబు
పరిధిగా [11]వాలిచితి మహావరణజలము
నిట్టి నేఁ జేరవచ్చిన నెదురుకొనవు
పాన్పు డిగ్గవు దురవలేపమున నీవు.

81


గీ.

ఎవ్వఁడవు చెప్పుమనిన లేనవ్వు నవ్వి
యిందిరావల్లభుఁడు బ్రహ్మ కిట్టు లనియె
నే జగత్కర్తనై యుండ నెట్లు నీవు
కర్తనని పల్కెదవు సిగ్గుగాదె చెపుమ.

82
  1. తా. కంజ
  2. తా. చటులోర్మీవ్యాపి
  3. తా. ద్వ్యతికలిత
  4. తా. తి
  5. తా. న
  6. తా. గ్రా
  7. తా. జాలనికటాయిత
  8. తా. నన్
  9. ము. నెఱుఁగురా
  10. ము. పాదుకొల్పితి
  11. ము. వాల్చితిని