పుట:శివతత్వసారము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంథమునందలి శైవమత సంప్రదాయవిషయములెన్నో క్రొత్తవి తెలియవచ్చినవి. ఇవియన్నియు, శివతత్త్వసారమున చేరవలసిన యావశ్యకత కాన్పించినది. భాషాసాహిత్య చరిత్రకారులు తెలుసుకొనదగిన విశేషములు బయలుపఱుపవలసిన యావశ్యకత యంతకంటెను ప్రధానమగుటచే నీ ముద్రణము ప్రారంభమైనది.

గ్రంథ పరిష్కరణ విధానము

పూర్వముద్రణమున నప్పటికిగల సాధనసామగ్రినిబట్టి గ్రంధపరిష్కరణము సాగించిన విధానము నిరూపితమైనది. ఒక్క బ్రతియే లభించునపు డెట్లు పరిష్కరింపవలెనో, ఆవిషయమేగాక-పాఠము మార్పులవల్ల చరిత్రకెంత యుపయోగపడునో యదియు తెలుపబడినది[1]. మూలప్రతిలో నచ్చటచ్చట క్రిమిదష్టము లుండుటచేత, నా భాగము చుక్కలతో చూపబడినది- గ్రంథమున నక్షరములు కొన్ని లోపించుటచేత-అవి పూరింపబడి కుండలీకరణము చేయబడినవి-ఇట్లెంతో జాగరూకతతో పూర్వముద్రణము సాగినది అయినను కొంత సంస్కరణ మావశ్యకమైనది.

పైనిచెప్పిన నూతన విషయములను, కన్నడ శివతత్త్వసారమును నాకళింపుకేసికొని - ప్రస్తుతముద్రణము - పరిష్కృతమై ప్రకాశికమైనది. ఆవిధానము నిట వివరించుచున్నాను.

దీనికి ముందుగా కన్నడ శివతత్త్వసారమును గూర్చిన వివరములు తెలుసుకొనవలెను.

కన్నడ శివతత్త్వసారము

కన్నడ శివతత్త్వసారమంతయు పూర్తిగ లభించలేదు. అందు 281 నుండి 472వఱకు —181 పద్యములు, 728 నుండి 740 వఱకు 12 పద్యములును మొత్తముమీద 193 పద్యములు మాత్రమే లభించినవి. తెలుగున శివతత్త్వసారమున నన్నియు గందములే అట్లే కన్నడమున కూడ కందమొలే. మనయదృష్టవశమున గ్రంథకర్తృత్వమును గూర్చిన పద్యము కన్నడమున నిట్లున్నది.

కన్న.

ధరయొళగె మల్లికార్జున
వరపండిత నెనుసితీహుదఱు నిన్నాజ్ఞా
భరమె సెయిర్ ప్రమథొరొళా
నిరి వెందీక్షితు వె నిమ్మ బయసువె నీశా.

  1. చిత్రదారతము - అచ్చుప్రతి - చిత్రాబ్జభానుడు - అర్ధములేదు. వ్రాత ప్రతి - చిత్తాపఖానుడు - విశేషార్థము గలది. ఈ చిత్తాపఖానుడే-షితాబ్ ఖాన్ - తెలుగు వాడైన సీతాపతి-1500 ప్రాంతమున ఒరంగలు నేలినవాడు. ఈతని గూర్చి- శ్రీయుతులు- ఆదిరాజు వీరభద్రరావుగారు వ్రాసిన షితాబ్ ఖాన్ అను గ్రంథము చూడదగును.