పుట:శివతత్వసారము.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విన్నపము వినుము సకలజ
గన్నాథ! యనాథనాథ కరుణాంబునిధీ![1]

11


క.

దురిత హరమనియు శుభములు
దొరకొను ననియును దలంచి దురితారి! భవ
చ్చరణాబ్జభక్తి లలనా
పరవశభావమున నిన్నుఁ బ్రణుతింతు శివా![2]

12


క.

గతదేహేంద్రియ [3]నిత్యా
స్వతంత్ర సర్వజ్ఞ విమల సర్వై గతైకా
ప్రతిమ సదానందాత్మక
మతి సూక్ష్మము నీ స్వరూప మతిలోకశివా![4]

13


క.

సర్వేశ్వర! షట్త్రింశ
త్సర్వోపరిగతజగత్ప్రభవ హేతు జగ
న్నిర్వాణ సోమరూప మ
ఖర్వ మహత్త్వంబుఁ బొగడఁ గడునరిది శివా![5]

14
  1. అట్టి లోకోత్తరుడవైన నిన్ను పొగడుటకు నేను లజ్జింతును. కాని నాది పొగడ్తకాదు. అది విన్నపము మాత్రమే.
  2. నిన్ను స్తుతించుటచే శుభములు గలుగును. నీపాదభక్తి భామిని పారవశ్యభావమున నిన్ను పొగడెదను.
  3. నిత్య ము.ప్ర., నిత్యా వ్రా.ప్ర.
  4. ఇందు శివుని సూక్ష్మస్వరూపము వివరింపబడినది.
  5. శివస్వరూపము షట్త్రింశతత్త్వములు- అనగా ముప్పదియాఱు తత్త్వములకు పైమెట్టున నున్నది. అవి, పృథిని, ప్రకృతి, బుద్ధి, అహంకారము, మనస్సు, శ్రోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణము, వాక్కు, పాణి, పాదము, వాయువు, గుహ్యము, శబ్దము, స్పర్శము, రవము, గంధము, ఆకాశము, వాయువు, వహ్ని, జలము, మాయ, కాలము, నియతి, కల, రాగము, పురుష, సదాశివ, ఈశ్వర, శుద్ధవిద్య, రూపము.