Jump to content

పుట:శాసనపద్యమంజరి.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంజాము ... 1
విశాఖపట్టణము ... 1
గోదావరి ... 11
కృష్ణ ... 17
గుంటూరు ... 52
నెల్లూరు ... 1
కర్నూలు ... 1
కడప ... 2
గోలకొండదేశము ... 2
                           ———
                           88
                           ———

మొత్తము పద్యములలో ముప్పాతికకు మించి కృష్ణాతీరమందు దొరికినవి. పూర్వకాలమందు, కృష్ణాతీరమందుఁ గవులెక్కుడుగా నున్నట్లు దీనివలనఁ దెలియుచున్నది.

ఈపద్యములవలని ప్రయోజనములు రెండువిధములు. దేశచరిత్రము తెలిసికొనుట యొకటి, ఆంధ్రశబ్దలక్షణమును ఛందస్సును గాలక్రమమున నెట్లు మాఱియుండునో యది తెలిసికొనుట యొకటి. భారతాది ప్రాచీనగ్రంథములు కూడ భాషాచరిత్రశోధన కుపయోగించునవియే కాని యవి పుట్టినవి పుట్టిన ట్లిప్పటివారికి లభించుటలేదు. కవులు వ్రాసిన మాతృకలు చిరకాలముక్రిందటనే నశించిపోయి... వానిని బట్టి యాయాకాలమువారు వ్రాసియుంచిన ప్రతులలోఁ జిట్టచివరవియె యప్పుడు దొరుకుచున్నవి. పాండిత్యాభావముచేత నేమి పాండిత్య ముండియుఁ బ్రాచీనప్రయోగములు తప్పు లనుకొని సవరించుటవలన నేమి కేవలప్రమాదముచేత నేమి ప్రతులు వ్రాసినవా రచ్చట్చటఁ బాఠముల దిద్దుచుండిరి. లిఖితప్రతులలోఁ బాఠాంతరములుండుటయే యిందులకు నిదర్శనము. ఇట్లు మారియున్న గ్రంథములం బట్టి కవిప్రయుక్తపాఠముల నిర్ణయించుటశ్రమసాధ్యము. ఈ శాసనపద్యము లన్ననో కవులజీవితకాలములో నెట్లు లిఖింపఁబడినవో యట్లే మనకు లభించుటచేఁ గవిప్రయుక్తపాఠనిర్ణయమున కత్యంతప్రబలసాధనములుగా నున్నవి. ఈ విషయములో నేమి యితరవిషయములలో నేను వీనిప్రామాణ్య మేమాత్రమును జెడకుండుటకై పద్యపాఠములు తూచాలు తప్పకుండ నున్నవి యున్నట్లే ముద్రింపఁబడినవి. ప్రమాదముచే నెక్కడనయిన నొక్కపాఠము తప్పియుండిన నుండునేమో కాని తప్పకుండ నుండవలయుననియే సర్వప్రయత్నములు చేసినారము.