ఈపద్యములం దయినను గవ్యుద్దిష్టములు కానిపాఠములు కొన్ని ప్రవేశించి యుండఁగూడదా యన్నచోఁ బ్రవేశించి యున్నవని యొప్పుకొనక తప్పదు. లేఖకప్రమాదజనితదుష్టప్రయోగము లనేకము లచ్చటచ్చటఁ గన్పట్టుచున్నవి. ఆపాఠము లున్నవి యున్నట్లే మూలమం దుంచి వానిని సవరించువిధ మాయాపుటలయం దడుగున సూచింపఁబడినది.
ఇవి గాక కవిప్రయుక్తము లనఁదగిన పాఠములలోఁ గూడ వర్ణక్రమమునందును శబ్దలక్షణమందును నిప్పటి సదాచారమునకు విరుద్ధము లయిన ప్రయోగములు కొన్ని కనఁబడుచున్నవి. ఇవి కూడ లేఖకప్రమాదజనితములే కాఁగూడదా యన్న నట్లు కానేరదని చెప్పవలసియున్నది. వివిధకాలముల వివిధదేశములందుఁ బుట్టిన వివిధశాసనము లన్నింటిలో నొక్కవిధముగా నున్నప్రయోగము లాయాకాలములందు జనసామాన్యసమ్మతము లయినవే గాని యాయాయి లేఖకులు కల్పించినవి కావని చెప్పక తప్పదు. అట్టి ప్రయోగములలో ముఖ్యమైన వీక్రింద వివరింపఁబడుచున్నవి. వీనిలో I. వర్ణక్రమమునకు సంబంధించినవి కొన్ని, II. శబ్దలక్షణమునకు సంబంధించినవి కొన్ని.
I. వర్ణక్రమసంబంధములు
1. అనుస్వారస్వరూపమును గుఱించి ముందుగా విచారింతము. అనుస్వారము తెనుఁగులోఁ బూర్ణ మనియు నర్ధ మనియు రెండువిధములు. నిండుసున్న పూర్ణానుస్వారరేఖ. అఱసున్న యర్ధానుస్వారరేఖ. శాసనములందుఁ గాని పూర్వపువ్రాతపుస్తకములందుఁ గాని యఱసున్న యెచ్చటను గానరాదు. అది యుండవలసినచోటఁగూడ నిండుసున్నయే కనఁబడుచున్నది. ప్రాచీనశాసనములలో నిండుసున్నకు బదులు వర్గాంత్యానునాసికాక్షరములు కనఁబడుచున్నవి. అనగా కట్టిఞ్చి, తమ్ముణ్ఢు, అన్తయేనియు, ఫలమ్బు, ఇత్యాదిరూపంబులు కనఁబడుచున్నవి. దీనిని బట్టి చూడంగాఁ దెలుఁగులో ననుస్వారమని వాడఁబడుచున్నది వర్గాంత్యానునాసికాపరరూప మనియు, అది తొలుత ననునాసికాక్షరముగానే వ్రాయఁబడుచుండి కొంతకాల మైనపిదప సౌకర్యార్థము బిందురూపముగా వ్రాయఁబడెననియు, ఆబిందువు తొలుతం బూర్ణముగానే యుచ్చరింపఁబడి రాను రాను లాఘవార్ధము దీర్ఘముమీఁద నిత్యముగాను హ్రస్వముమీఁద నైకల్పికము గాను దేల్చి పలుకఁబడసాగె ననియు దీనివలననేపూర్ణార్ధానుస్వారభేద మేర్పడియె ననియుఁ దేలుచున్నది.
2. శాసనములలోఁ గొన్నిచోటులు వ్రాఁత యొకవిధముగాను బలుకుబడి యొకవిధముగాను గనఁబడుచున్నది. ఉదాహరణము:-
(క) రెండవశాసనములో "నెగి దీచ్చెన్ మఠంబు” (2 వ పద్యము) "అశ్వమేధంబు