Jump to content

పుట:శాసనపద్యమంజరి.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసనపద్యమంజరి

పీఠిక

ఆంధ్రదేశమం దచ్చటచ్చట నున్న శిలాశాసనములందలి తెలుఁగు పద్యము లిందుఁ గూర్పఁబడియున్నవి. వీనిలో ననేకములు మాతృకలను బట్టి గాని వాని ప్రతిబింబములను బట్టి గాని నేను స్వయముగాఁ బ్రతివ్రాసినవియే. కొన్ని శాసనము లచ్చటచ్చట నిదివఱలో బ్రకటితములై యున్నవి. ఏయే గ్రంథములందు ముద్రింపఁబడినవో యవి యథాసందర్భముగ సూచించినాఁడను. ఇదివఱకుఁ బ్రకటింపఁబడని శాసనములలో నేవియైన రాజకీయశాసనాధికారవర్గముచే సంభృతములైన శాసనములలోఁ జేరియున్నచో నాశాసనము లాశాసనవర్గమువారు ప్రకటించిన యేయేసంవత్సరపు పట్టికలలో నేయేసంఖ్య గలవిగా నున్నవో యదియు సూచించినాఁడను. ఇందు మొదటిశాసనము 770వ శకసంవత్సరప్రాంతమునందును, చివరిది 1600వ శకసంవత్సరప్రాంతమందును బుట్టిన వగుటచే నెనిమిదివందల సంవత్సరములకంటె నధిక మగుకాలమందుఁ బుట్టినపద్యము లిందుఁ గలఁ వని తేలుచున్నది. వీనిలో మొదటిశాసనము నన్నయభట్టారకుని ప్రభువగు రాజరాజనరేంద్రునికంటె నూటడెబ్బది ఎనిమిది సంవత్సరములు పూర్వము – అనగా శ.స. 766 మొదలుకొని రాజ్యముచేసిన గుణగవిజయాదిత్యుని రాజ్యకాలమునఁ బుట్టినది. దానికి నించుమించుగా నేఁబది సంవత్సరముల పిదప రెండవశాసనము పుట్టినది. కావున నీరెండు శాసనములును వాగనుశాసనకాలముకంటెఁ బూర్వము పుట్టినవే. ఈనాఁటిమండలముల వరుసనుబట్టియే యేయేమండలములలో నెన్నెన్ని శాసనములు దొరికినవో యీ క్రిందిపట్టికవలనఁ దెలియఁదగు.