Jump to content

పుట:శాసనపద్యమంజరి.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాయంసమయాల్లో తన కిష్టమైన సాహిత్యకార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. ఆ రోజుల్లో పిఠాపురం, బొబ్బిలి, వెంకటగిరి సంస్థానాధీశులు, తుని రాణిగారు, ఉయ్యూరు జమీందారులు తదితరు లెందర్నో ప్రోత్సహించి వారినుంచి ఆర్ధికసహాయం పొంది “ఆంధ్రసాహిత్యపరిషత్తు" నొకదాన్ని ఏర్పాటు చేసి తద్వారా ఎన్నో ప్రాచీనశిలాశాసనాలను, సుమారు ఐదువేల తాళపత్ర సంపుటాలను సేకరించారు. అలాగే, అనేకానేక అముద్రిత, అమూల్యగ్రంథాలను సేకరించి సాహిత్యపరిషత్తుకు అందజేశారు. ఆంధ్రసాహిత్యపరిషత్తు తొలుత చెన్నైలో వున్నా, ఆ దరిమిలా కాకినాడకు తరలించారు. ఈ పరిషత్ పక్షాన ఒకపత్రికను కొంతకాలంపాటు నిర్వహించారు. ఈ పత్రిక ద్వారా ఎన్నో అమూల్యసాహిత్యసమాచారాన్ని ప్రచురించి వాటిని ప్రత్యేకగ్రంథాలుగా, సంపుటాలుగా తెలుగువారికి అందించిన ఘనత రామయ్య పంతులుగారికి దక్కుతుంది.

సంస్కృతం, తెలుగు భాషలలో గొప్పపాండిత్యంతో పాటు, 1882లోనే డిగ్రీ పూర్తి చేసిన జయంతి రామయ్య 1884లో పిఠాపురం మహారాజావారి స్కూలులో ప్రధానోధ్యాపకుడిగా కొంతకాలం పన్జేసారు. ఆ దరిమిలా న్యాయశాస్త్రం అధ్యయనం చేసి బి.ఎల్. పట్టా పొంది 1911లో జిల్లా మేజిస్ట్రేటుగా నియమితు లయ్యారు. బ్రిటీషువారి పాలనలో ప్రముఖన్యాయాధికారిగా స్థానికప్రజలందరికీ ఎనలేనిసేవ లందించా రాయన. అంతేకాదు ఉత్తరరామచరితము, ముక్తేశ్వరశతకం, చంపూరామాయణం, అమరుకము వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను ఆయన రచించారు. 'ఆంధ్రవాఙ్మయవికాసవైఖరి' అనే విమర్శనాత్మకగ్రంథం, ఇంగ్లీషులో "Defence of Literary Telugu, Dravidian Lexicography" వంటి పలుగ్రంథాలను ఆయన రాశారు. తెలుగు భాషాచరిత్రలకు సంబంధించి జయంతి రామయ్య చేసిన పరిశోధనలు అనన్యసామాన్యం. గిడుగువారి వ్యవహారికభాషావాదనపట్ల మక్కువ చూపక గ్రాంథికభాషావాదిగా తనను తాను ప్రకటించుకున్నా రాయన. తెలుగుభాషకు ఇతోధికసేవ లందించిన జయంతి రామయ్య పంతులు గారు 1941 ఫిబ్రవరి 19వ తేదీన 81 సంవత్సరాల నిండువయస్సులో స్వల్ప అస్వస్థతకు గురై తుదిశ్వాస విడిచారు. తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీయుడు జయంతి రామయ్య పంతులు.

డా.మల్లాది కృష్ణానంద్

(మన తెలుగు పెద్దలు నుంచి)