Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70 వ్రతరత్నాకరము

ఇతరములైన పెక్కువేల జన్మములలో నెంత పుణ్యము జేసితినో! అట్లుకాని మీపాదారవిందముల దర్శనము నాకబ్బునా” అని యావరలక్ష్మీదేవిని బహువిధములుగా స్తోత్రముచేసెను. ఆవరలక్ష్మీదేవియు ఆచారుమతిచే స్తోత్రము చేయఁబడినదై ఆచారుమతికిఁ బెక్కువరంబుల నొసఁగి యంతర్ధానము నొందెను.

చారుమతియు స్వప్నమువచ్చిన పిమ్మట పరుండి నిద్రపోవక మేల్కాంచి, సూర్యోదయమైన తరువాత తన స్వప్నవృత్తాంతమును దన బంధువులకు దెలిపెను. బంధువులును “చారుమతీ, నీస్వప్నంబు బాగుగా నున్నది. మంచిది, మనమందఱము ఆలాగే చేయుద” మనియు నిశ్చయించుకొని శ్రావణపూర్ణిమకు ముందటి శుక్రవార మెన్నఁడు వచ్చునా యని యెదురుచూచుచుండిరి. వారియదృష్టవశంబున వరలక్ష్మీ వ్రతదినము ప్రాప్తింషగా, స్త్రీలు మనస్సులందు విచారము మాని, పరిశుద్ధముగా స్నానముచేసి, వింతవింతలైన బట్టలగట్టి క్రొత్తబియ్యముతోను, మఱ్ఱియిగుళ్లతోను నిండినపూర్ణకుంభమునందు వరలక్ష్మీదేవి నావాహనముచేసి, చారుమతి మొదలగువారందఱు భక్తితోఁ బూజలు సల్పిరి. “పధ్యాసనే పద్మకరే... సర్వదా" అను శ్లోకము చెప్పి, యా వరలక్ష్మీదేవి నావాహనము చేసి, మఱియు కల్పమందుఁ జెప్పఁబడిన ప్రకారము పోడశోపచార పూజలను జేసి, కుడిహస్తమందుఁ దోరముసు కట్టుకొని, నేతితోఁ జేయఁబడిన భక్ష్యభోజ్య చోష్య లేహ్యపానీయాది సకలవిధపదార్థంబులను నివేదనచేసి చక్కని నిష్ఠగల యొక ముసలి బ్రాహణునికిఁ బండ్రెండుభక్ష్యములను దక్షిణా తాంబూలాదులతో వాయన మిచ్చి యా దేవి సన్నిధానంబున