Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

71 వరలక్ష్మీవతము

దాము నివేదనచేసిన భక్ష్యభోజ్యాదులగు సకలపదార్థములతోగూడిన యన్నమును దనివితీఱ భుజించిరి.

తర్వాత వరలక్ష్మీ ప్రభావంబుననే చారుమతి మొదలగు స్త్రీలందఱు వరలక్ష్మీదేవి యనుగ్రహమువలన ముత్యాల మాణిక్యములహారములను మెడనిండ ధరించిరి. కాలియందెలను, రవలు చెక్కినసొమ్ములను బడసిరి. ఇట్లు కలిమియేకాక, పుత్రపౌత్రాదులను, ధనధాన్యసమృద్ధిని బడసి, యెల్లప్పుడన్నదానమునందును బంధువులపోషణయందును మిక్కిలి శ్రద్ధగలవారలై, చతురంగబలముచే నిండిన తమతమ గృహంబులకుఁ జనిరి.

ఓ పార్వతీ! చారుమతీ దేవివలన విన్నయావరలక్ష్మీవ్రతంబు ఆనగరమందుండువా రొండొరులకుఁ జెప్పికొనిరి. ఓ పార్వతీ! ఇది నిజము. ఇది నిజము. ఈ వ్రతంబు నాచరించుటవలన మానవుడు మేలులను బడయును. చారుమతీదేవిమూలమున మనము కోరిన కోర్కులెల్లఁ బడసితిమి. చారుమతి యెంతపుణ్యాత్తురాలు! ఎంతమహిమగలది! ఆమెకు వరలక్ష్మీదేవియే ప్రత్యక్షమై యీ వ్రతంబు నుపదేశించినది. అని యాచారుమతిని బొగడిరి. ఓ పార్వతీ! అది మొద లీవ్రతము వరలక్ష్మీవ్రతంబని లోకమునఁ బ్రసిద్ధమయ్యెను. ఇది వ్రతములలోనెల్ల నుత్తమ వ్రతము. దీని నీకు సవిస్తరముగాఁ జెప్పితిని. ఎవరీ వ్రతంబును వినుచున్నారో లేక నెమ్మదిగా ఒరులచేత వినిపించుచున్నారో, వారికి వరలక్ష్మీదేవి ప్రభావమువలన సకలకార్యములును సిద్ధించును” అని పార్వతీదేవికిఁ జెప్పెను.

ఇది భవిష్యోత్తరపురాణంబునందలి పార్వతీ పరమేశ్వరుల సంవాదమున వరలక్ష్మీవ్రతంబు సంపూర్ణము.