పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వరలక్ష్మీవ్రతము 69

జూచి, “నాథా ఆ వ్రతంబు నేవిధితోఁ జేయవలెను? ఆవ్రతంబునం దే దేవతను గొలువవలయును? ఆవరలక్ష్మీదేవి నింతకుముందెవరారాధించి యామెను సంతోషపెట్టిరి?” అని యడుగఁగా, నీశ్వరుడు పార్వతీదేవితో నిట్లనియె.

"ఓ ప్రియురాలా! పావనమైన వరలక్ష్మీ వ్రతప్రభావంబు చెప్పెద నాలకింపుము. బంగారు ప్రాకారముతో గూడి, బంగారుమయంపు టిండ్లతోఁగూడి సకలభూషణములచే సింగారింపఁబడిన కుండిన మను పేరుగల పట్టణమొకటి కలదు. ఆపట్టణముందు చారుమతియను బ్రాహ్మణస్త్రీ యొకతె యుండెను. ఆమె భర్తయందు భక్తి గలిగి అత్తమామలకు శుశ్రూష సల్పుచుండును. ఆమె యన్ని పనులను జేయఁగలది, అన్ని శాస్త్రములను జదివినవి, ఎల్లప్పుడు ఇంపుగా మాటాడునది. నిర్మలమైన మనస్సుగల యాచారుమతీదేవికి లక్ష్మీదేవి స్వప్నమందుఁ బ్రత్యక్షమై “ఓమంగళకరురాలా! రమ్ము నీకు మేలయ్యెడు. వరలక్ష్మీదేవి వచ్చినది. శ్రావణమాసంబున బున్నమకు ముందుగా వచ్చెడి శుక్రవారంబున నన్ను బూజింపుము. నీకు కోరినవరంబు నొసంగెదను.” అని చెప్పగా చారుమతి స్వప్నమందే యావరలక్ష్మీదేవి నెక్కు వసంతసముతో జగములకన్నింటికిఁ దల్లివి. పుణ్యస్వరూపురాలవు; శరణుజొచ్చిన వారిని గాపాడుదానవు; ముల్లోకములవారిచేఁ గొనియాడఁదగిన దానవు; విష్ణువు యొక్క ఱొమ్మున నుండుదానవునైన యో దేవీ! నీవెవనిని గటాక్షముతో జూతువో, ఆమానవుఁడే పుణ్యాత్ముడు; ఆతఁడే సుగుణములతో 'ఁగూడినవాఁడు; ఆతఁడే కొనియాడదగినవాడు; ఆతడే యాలుబిడ్డలు గలవాడు; ఆతఁడే శూరుఁడు; ఆతఁడే పండితుఁడును. ఓహరి ప్రియురాలా!