Jump to content

పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సరస్వతీ వ్రతము

స్నానము చేసి, యాబ్రాహ్మణోత్తమునియానతిప్రకారము దుర్గాదేవిని ఆశ్వయుజశుద్ధపాడ్యమిమొదలు మహానవమివఱకుఁ గుంకుమాదులతోఁబూజించి, పదియవదినమున 'దుర్గాం దేవీగ్ శరణమహం ప్రపద్యే౽లక్ష్మీర్మేనశ్యతాంత్వాం వృణే' అనుమంత్రముచే క్షీరాన్నముతో హోమము చేయించెను. తర్వాత సువేది యాంగీరసమహామునికి దంపతిపూజ చేసి, బ్రాహ్మణుల కెక్కువగా దశదానము లిచ్చి వ్రతము పూర్తిగావించుకొని, తనయాశ్రమమునకు వచ్చెను. వచ్చిన కొన్నిదినములకే ఆసువేది గర్భము దాల్చి తొమ్మిదినెలలు నిండినతోడనే పురుషశిశువును గనెను. ఆంగీరసమహామునియే యాశిశువునకు జాతకర్మనామకరణంబులు జరిపించెను. ఆమునియే యాశిశువునకు సూర్యప్రతాపుఁడని పేరు పెట్టెను. ఆబాలుఁడు శుక్లపక్షచంద్రుని మాడ్కి దినదినప్రవర్ధమానుఁడై సకలశాస్త్రములను జదివి, యౌవనము పొంది ఋషి యొసఁగిన ప్రభావముతోఁ గూడి మహర్షులందఱి దీవనలను బడసి శత్రుపురంబునకుఁ బోయి పగతురనందఱం బరిమార్చి, తనరాజ్యము లాగికొని, తల్లిదండ్రులతోఁ గూడఁ దనపురంబునఁ కేగి రాజ్యము చేయుచు సుఖంబుగా నుండెను. ఆసువేదియుఁ బ్రతియేఁటను ఈవ్రతము నాచరించి పుత్రపౌత్రధనసమృద్ధి గలదై యిహంబున సర్వసుఖములను బొంది, పరలోకమున శాశ్వతమోక్షసుఖమును బొందినదాయెను; కావున మునీంద్రులారా! సకలవర్ణాశ్రమములవారును ఈవ్రతంబు చేయవలెను. ఈవ్రతకథను విన్నవారును, చదివినవారును, చదివి వినిపించినవారును పాపములనుండి తొలఁగి యుత్తమలోకంబు నొందుదురు.

శ్రీస్కాందపురాణాంతర్గతం బగుసరస్వతీవ్రతము సంపూర్ణము.

————