పుట:వ్రత రత్నాకరము, ప్రథమ భాగము.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వ్రతరత్నాకరము

ఆబాలుఁ డాధనంబుసుగూడ దీసికొని, తల్లికడకువచ్చి, జరిగిన సంగతియెల్ల నామెతోఁ జెప్పెను. ఆభాగ్యవతియుఁ దానుల్లం ఘనము చేసియుండిన కేదారవ్రతంబును మఱల భక్తితోఁజేసి, తనతప్పిదమును క్షమింపఁ గేదారనాథుని వేఁడెను. తర్వాత నా బాలుఁడు కేదారనాథుని యనుగ్రహమువలనఁ జతురంగ బలముతోఁ గూడిన వాఁడై కాంచీపురంబునకు రాఁగా, చోళ రాజగు తనతండ్రి యెదురేగి వారిని బిల్చుకవచ్చి, బహుకాలము పెంపొందుచుండెను.

అది మొదలు భాగ్యవతియు, చోళరాజును ఆవృతంబును. జేయుచు సకలసంపదలతో నిండి రాజ్యపరిపాలనము చేయుచుండిరి. ఈ వ్రతంబు గౌతమమునీంద్రుఁడు పార్వతి కుపదేశించినది గనుక నిహపర సుఖముఁ గోరుమానవుఁ డీవ్రతంబును జేసెనేని యిహమున సకలాభీష్టములను బొంది, యనంతర మునఁబరమశివుని సాయుజ్యమును బొందును. ఈ వ్రతమహిమ విన్న వారికిని చదివినవారికిని మహాదేవుఁడు సర్వసంపదల ననుగ్రహించును.

ఇది స్కాందపురాణోక్త కేదారవ్రతకథ

సంపూర్ణము.