పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

7. రామచరితము.

రామునిపుట్టుక, రామునిమహిమ, దక్షిణాపథము, ఋషిజనస్తోత్రము మొదలగువిషయములు మూలమున లేనివి యిందు కల్పించి వ్రాయఁబడినవి.

(ఆ 45వ 165 -193)

ఈయాశ్వాసమునందే పరశురామవర్ణనగల 276 పద్యమునకు మూలాధారము లేదు. గ్రంథమంతయు మూలముతోఁ బోల్చి చూడఁగా స్వకల్పితములని చెప్పందగిన ప్రకరణము లివిమాత్రమే. గ్రంథబాహుళ్యమును బట్టి యీస్వల్ప ముపేక్షించితిమేని, రచన మొత్తముమీఁద యథామాతృక మనుట సత్యేతరము కాఁజాలదు. ప్రాసంగికముగా సూరన విష్ణుపురాణమునుగూడఁ దడవి ప్రకరణవశమునఁ జెప్పఁదగిన తారతమ్యములఁ దెల్పితిమి. కాని యింకొక్క విషయము. సంస్కృతపురాణ మాఱంశలు గలది. సూరన దాని నంతయు నెనిమిది యాశ్వాసములుగాఁ దెనిఁగించెను. ఈ గ్రంధమున నాల్గంశలు మాత్రమే గలవు. తక్కు రెండును నీకవి తెనిఁగింపనే లేదో, యట్లుగాక గ్రంథమే నష్టమైనదో, యుభయపక్షముల నేదియైనను నిదిమాత్ర మసమగ్రగ్రంథమే యైనది.

శైలి:

సాధారణముగాఁ బురాణములయందలి శైలికిని, ప్రబంధముల శైలికిని స్థూలదృష్టికిఁ గూడ గోచరించు వాసి యుండును. మొదటిది ప్రసన్నగంభీరమైన శరన్నదీప్రవాహమువంటిది. రెండవది దరులొరసి కొనుచు, తరంగితమై పొంగిపొరలు ప్రావృట్ప్రవాహమువంటిది. తెనుఁగున భాగవతమువంటియే యొకటి రెండో లతక్క, తక్కినపురాణము లన్నియు నీ ప్రమాణమునకు విధేయములే. తెనుఁగునఁ బ్రబంధరచనయుఁ, దత్పఠనమును మిక్కిలిగా సాగినపిమ్మట బయలు దేరిన పురాణములు కాలధర్మ మతిక్రమింపఁజాలక ప్రబంధఫక్కినే నడచినవి. కంకంటి పాపరాజకృతోత్తరరామాయణ మిందుకుఁ దార్కాణ. ఈ భావనారాయణ విష్ణుపురాణమును నిట్టిదియే. వెన్నెలగంటి సూరన గ్రంథమునకును దీనికిని ముఖ్యభేద మిచ్చటనే కలదు. సూరనశైలి సర్వథా పురాణవిలక్షణశోభితము. ఇది ప్రబంధలక్షణసంయుతము.

8. శబ్దప్రయోగవిశేషములు.

కొన్నివ్యాకరణములను ప్రమాణములుగా గైకొని యీగ్రంథమును బరీక్షించినచోఁ దప్పులని చెప్పఁదగిన ప్రయోగములు కొన్ని పొడగట్టును, కాని