పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ననియు, నంత నాతనితపము కలతవడి చెడెననియు, నేమేమో పెంచి కొన్ని రసవంతములైన పద్యములు పొందుపఱచినాఁడు, (1 ఆ వ 406 412) ఇది మూలాతిక్రమణమే యైనను రససంపాదన హేతువే యైనది. మఱియుఁ గండుముని మరల నెఱుక గలవాడై యప్సరస నుజ్జగించి కాలక్రమమున శ్రీ పురుషోత్తమక్షేత్రము చేరి స్వామిని సందర్శించు సందర్భమున నిందు గల పద్యములకు మూలమున నాధారములేదు. (ఆ 1450 477 ప.) కవి యిచ్చట నింత విపులవర్ణనము చేయుట కేవల మిష్టదేవతాపక్షపాతగరిమచేతనే యనవచ్చును.

5. ప్రహ్లాద చరిత్ర.

భాగవతప్రసిద్ధమైన నృసింహావిర్భావము విష్ణుపురాణమున లేనేలేదు. హిరణ్యకశిపుఁ డనుతప్తుఁడై కుమారునిఁ బ్రేమపూర్వకముగాఁ గైకొని శేషించిన జీవితకాలము సుఖముగా గడిపిన ట్లొకశ్లోకమున నున్నది. అట్లయ్యును దరువాతిశ్లోకమునఁ బ్రహ్లాదరాజ్యాభిషేకమునకుఁ గారణముగాఁ దండ్రి నృసింహునిచే నంత మొందింపఁబడఁగాఁ బ్రహ్లాదుఁడు రాజయ్యెనని కలదు. ఇది సందర్భరహితముగానున్నది.

ఇత్యుక్త్వా౽తర్దధే విష్ణుః, తత్ర మైత్రేయ పశ్యతః।
నచాపి పునరాగమ్య వవందే చరణా పితుః॥
తంపితా మూర్ధ్న్య వఘ్రాయ, పరిష్వజ్యచ పీడితమ్।
జీవసీత్యాహ, వత్సేతి బాష్పార్ద్ర నయనోద్విజ॥
ప్రీతిమాంశ్చా భవత్తస్మిన్, అనుతాపీ మహాసురః।
గురుపిత్రోశ్చ కారైవ, శుశ్రూషాం సోపిధర్మవిత్॥
పితర్యు పరతంనీ తే, నరసింహ స్వరూపిణా।
విష్ణునా సో౽పి దైత్యానాం, మైత్రేయా భూత్పతి స్తతః॥

మూలమున నిట్లుండఁగా నీ తెనుఁగుసేఁతలో నృసింహరూపము మాటయే వదలి జనకుఁడు దివి కేగఁ బ్రహ్లాదుఁడు రాజయ్యెనని కలదు.

సీ.

జనకుండు దివికిఁ బోయిన దైత్యపతి యయ్యెఁ బ్రహ్లాదుఁ డంత

(ఆ 1 ప 657)

వెన్నెలగంటి సూరన్న గ్రంథములో నింకను భిన్నముగానున్నది.

(ఆ 2 వ 329 etc)

6. జడభరతోపాఖ్యానము

ఈ గాథ యిందు మూలమును సూరనరచననుగూడ ధిక్కరించుచున్నది. భాగవతముతోఁగూడఁ బోల్చిచూడ భావనారాయణ రచనయే సర్వాతిశాయియై