పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


త్నిమదికి విస్మయంబొదవఁ దెల్లము తండ్రియుఁ బొందనోపఁ డు
త్తముఁడన నెంత యంచు విబుధప్రవరు ల్వినుతించునట్లుగన్.

అనియాడినమాట మూలములో లేదు. ఈ యతిక్రమణమువల్ల నేమేని గుణము లభించినదా యన్న, ధ్రువున కహంకారము కూర్చినదేకాని గుణము కూర్పలేదు. ఈ కథకు మూలమున లేని వన్నె తెచ్చినవాఁడు వెన్నెలగంటి సూరన. రససంపాదనార్థ మాతఁ డీకథను గొంత విపులముగఁ బెంచి వ్రాసి సంకల్పసిద్ధుఁ డయ్యెను, సర్వథా యీ ఘట్టమున సూరనయే మేలు చేయి యనవచ్చును. ఉదాహరణార్థ మొకసందర్భము చూపెదము. సవతితల్లిచే వేటువడి బిక్కుమొగముతో ధ్రువుఁడు తల్లి చెంతకుఁ బోవుటను.

క.

ధ్రువుఁ డపు డవిరళకోపో, ద్భవుఁడై యచ్చోటు వాసి తనునొందుపరా
భవము తనతల్లి కెఱిఁగిం, చ వడిం దద్గేహమునకుఁ జయ్యనఁ బోయెన్.


క.

పరిభవపీడితు నీషత్, స్ఫురితాధరుఁ దనయు నపుడు చూచి జనని యా
దరమున నంకస్థలి నిడి, శిర మాఘ్రాణించి యనియెఁ జిత్తము చెదరన్.

అని భావనారాయణ చిత్రించెను. దీనినే సూరన.—

చ.

కనుగవ నశ్రుపూరములు గ్రమ్మగ వీడిన కాక పక్షముల్ వెనుకకు వీల దైన్యరసవేదన నిల్వఁగ లేక యేడ్చుచున్ జనని నికేతనంబునకుఁ జయ్యనఁ బోయి ధ్రువుండు దీనుఁడై తన పెదతల్లి సేతయును దండ్రియుపేక్షయుఁ జెప్పెఁ జెప్పినన్

గీ.

కొడుకుకన్నుల బాష్పముల్ తుడిచి తల్లి, శిరము మూర్కొని కౌగిటఁ జేరియేడు
పుడిపితనకును గన్నునీ రొలుకుచుండ, నతనితో గద్గదస్వర యగుచు ననియె.

అని సరళతాసుందరములును, హృదయంగమములు నైన పద్యములలో వర్ణించెను.

4. కండుముని చరిత్ర.

ఈ మునితపము సేయ దొరకొనఁగాఁ దక్షోభ కొఱకు సురేంద్రునిచేఁ బ్రమ్లోచయను నప్సరస ప్రయుక్తయై యామునిని గలఁచెనఁట.

నతేపే సుమహత్తపః,
తత్ క్షోభాయ సురేంద్రేణ ప్రమ్లోచాఖ్యావరాస్సరాః
ప్రయుక్తాక్షోభయా మావత మృషింసాశుచిస్మితా॥

మూలము

ఈ ఘట్టము వర్ణనానుకూలవిషయముగాన నీకవి యాముని చేయుతపము వేఁడిమి దుర్వారమై లోకముల బెగ్గిడిలఁజేసెననియు, నంత దేవేంద్రప్రేరితయై వచ్చి ప్రమ్లోచ యా మునిమ్రోల శృంగారచేష్టావిలాసములు నెఱవె