పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈపురాణమునకుముం దీకవి పురుషో త్తమఖండమను నొకప్రబంధము వ్రాసెనఁట.

గీ.

ఘనత శ్రీపురుషోత్తమఖండ మాంధ్ర
నవ్యపదబంధములఁ బ్రబంధంబు చేసి
యెన్నఁగలదైవమైయున్న వెన్నముద్ద
ముద్దుకృష్ణున కంకితంబుగ నొనర్చి.

(ఆ 1 వ 11)

ఈ పురాణమును మూలముతోను, వెన్నెలగంటి సూరని విష్ణుపురాణముతోడను బోల్చి చూచితిమి. తఱచి చూడఁగాఁ దెనుఁగుపురాణములలో నింతయథామాతృక మైన రచనయే కన్పట్టదు. వెన్నెలకంటి సూరన విష్ణుపురాణము భారతాదులవలె మూలమునకు యథోచితానుసరణమేగాని దీనివలె యథామాతృకము కాదు. తనకుఁ బూర్వము సుప్రసిద్ధమైన యొకవిష్ణుపురాణము తెనుఁగున నుండగాఁ దానును నా గ్రంథము రచింపఁబూనుటలో నీకవి సంకల్పము స్ఫర్థాహంకారప్రేరితముగాక మూలవిధేయతను సంపాదించు కోర్కెవలనఁ గలిగి యుండును. నేఁడు బ్ర ॥ శ్రీ వే. కవిరాజ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారి భారతరచనాసంకల్పము వంటిదే యీ భావనారాయణకవి సంకల్పమై యున్నది. ఇందీతఁడు కృతార్థుఁ డయ్యెననియే చెప్పవచ్చును. ఎడనెడఁ గొలఁది మూలాతిక్రమణము లున్నను నవి యంతగాఁ బాటింపఁడగినట్లుగా నగపడవు. అయినను నెచ్చో స్వతంత్రరచనలున్నవో, వానినన్నిటి నేరి యీక్రింద బొందుపఱచెదము.

1. యజ్ఞవరాహావిర్భావఘట్టమున మూలములో లేనితన్మూర్తివిశేషవర్ణన మిందుఁ గలదు. మూలమున

సామస్వరధ్వనిః శ్రీమాన్, జగర్జపరిఘర్ఘరః

అని యున్న యేకవాక్యమును బురిస్కరించుకొని యీ కవి,

సీ.

తనువు విదర్ప సంస్తబ్ధతనూరుహో, ద్ధతి నజాండంబురంధ్రములు వోవ
వాలధి త్రిప్ప దుర్వారవాతాహతి, నబ్దముల్ వలయాద్రియవలి కేగ
ఘుర్ఘురధ్వని చేయఁ గోటిసంఖ్యాక, నిర్ఘాతారభటిశంక గడలుకొనఁగ
అడుగు పెట్టిన బలోదగ్రఖురాదిఘట్టన నగేంద్రములైనవ దునిసిపోవ


గీ.

హరియె యజ్ఞత్రయీమయంబైనఘోణిరూపధేయంబు దాల్చి యారూఢమహిమ
దనుజనస్థానవాసులై మునులు వుగడ, సంభృతోల్లాసభాసియై జలధిఁ జొచ్చె.

(ఆ 1 ప 98)