పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిక్కినది. దీనిని బట్టియైనను సిద్ధాంతము చేయ సాహసింపక బలవత్తరమైన యాధారము లభించువఱకు నిదియే యుపాదేయము కావచ్చునని కైకొంటిమి.

సుదక్షిణాపరిణయకర్తయైన తెనాలి అన్నయ్యకును, నీ భావనారాయణకును గురుస్థాన మొకటియే.

క.

కందాళ భావనార్యుల, నందను శ్రీరంగగురుని సతబుధరక్షా
మందారంబు నుతింతును, మందారమరందబిందుమధురారభటిన్.

(సుదక్షిణాపరిణయము)

కందాళభావనార్యుని కుమారుఁడైన శ్రీరంగాచార్యులే మనయడవిభావనారాయణకవికిని గురువని యూహించుట కాధారము, రెంటను దండ్రిపేరుకూడ సరిపోవుటయే.

ఈ సుదక్షిణాపరిణయకృతీశ్వరుఁడు కోనేటి రామరాజు మంత్రియైన పులిజాల సోమనామాత్యుఁడు. ఈ కోనేటి రామరాజు, సదాశివరాయలకుఁ బ్రతినిధిగా విజయనగరసామ్రాజ్యము పాలించి 1565 లోఁ దల్లికోటయుద్ధమున గతించిన అళియరామరాజునకుఁ బెదతండ్రికొడుకు మనుమఁడు. అళియరామరాజు చిరకాలజీవి. అతనికి మరణకాలమునాఁటికే యెదిగిన మనమలు కలరు. కాన నాతని పెదతండ్రి కొడుకునకును నాతల్లికోటయుద్ధమునాఁటికే మనుమఁ డుండియుండివచ్చును. ఆ మనుమఁడు (కోనేటి రామరాజు) రాజ్యాధిపత్యము వహించుటకుఁ గొంత యెక్కువకాలమే పట్టినదనుకొన్నను, నట్టిది క్రీ॥శ॥ 1600 సంవత్సరప్రాంతముల జరిగియుండవచ్చును. కనుక సుదక్షిణాపరిణయకృతీశ్వరుని ప్రభువు క్రీ॥ శ॥ 1600 సంవత్సరప్రాంతములవాఁడు. కాఁగా సుదక్షిణపరిణయకర్తయు నాకాలమువాఁడే యగును. మన భావనారాయణయు నాతనికి సమకాలికుఁ డగుటచే నప్పటివాఁడే యైయుండును. అనఁగా క్రీ॥శ॥ 16 శతాబ్దితుదిభాగమువాఁడని మాత్రమే చెప్పవచ్చును.

భావనారాయణ శ్రీ పురుషోత్తమస్వామిభక్తుఁడు. సుభద్రాదేవతోపాసకుఁడు. కావుననే "సుభద్రాకరుణాకటాక్షలబ్ధకవిత్వతత్వపవిత్రుండ" నని చెప్పికొనెను. (ఆ 1 ప 10) కందాళ శ్రీరంగాచార్యు లీతని గురువు. గురు వనఁగాఁ గులగురువేగాక, విద్యాగురువని కూడ నూహించుట కాధారముగా "కందాళ శ్రీరంగగురుని మద్గురుని భజింతు నభీష్టార్థరూఢికొఱకు" (ఆ 1 ప 6) అని గురుశబ్దము రెండుమార్లు ప్రయుక్తమైనది. గురుదేవతాభక్తి కలవాఁడగు నీకవి విద్యాగురు నొకని వేఱుగాఁ బేర్కొనకపోవుటయు నీ యూహకుఁ బ్రోద్బలముగానున్నది.