పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉపోద్ఘాతము

ఈ విష్ణుపురాణమును దెనిఁగించిన కవి భావనారాయణ. ఆశ్వాసాంతగద్యముల నీతని యింటిపేరు కలిదిండివా రని కలదు. కాని కృత్యాదిపద్యములలో స్వవిషయమును జెప్పుకొన్న—

"సీ.

సమధికస్ఫూర్తి కృష్ణాగౌతమీమధ్య, దేశంబునకు భవ్యతిలక మగుచుఁ,
బొగడొందు కలిదిండిపురమున కధిపతి, సుగుణుఁ డాపస్తంబసూత్రుఁ డధికుఁ
డసమశాలంకాయనసగోత్రుఁ డడవిరా, చయమంత్రి వెలయుఁ నయ్యనఘమతికిఁ
దనయుండు మంత్రి రాజనఘుఁ డాతఁడు గాంచె, విమలచారిత్రుని వెంకటాద్రి
నమ్మహాత్మునకును సూరమాంబికకును, నందనుఁడఁ బూరుషోత్తమనాథపాద
వందనానందమహిమ జీవాతుజీవ, నాఢ్యుఁడను భావనారాయణాభిదుఁడను.”

అనుపద్యమునుబట్టి యింటిపేరు 'అడవి' వారనుటయుఁ గలిదిండియనునది యీతనినివాసగ్రామముపేరే కాని యింటిపేరు కాదనుటయు స్పష్టము. కాని యితనిముత్తాత రాచయమంత్రి కలిదిండి కధిపతియై యుండుటను బిమ్మట మూఁడుతరములు కడచునప్పటికి (భావనారాయణునినాఁటికి) మొదటియింటిపేరు పోయి చిరకాలనివాసమువలన గ్రామనామమే గృహనామముగా సిద్ధించెనేమో? అట్లు జరుగుటయుఁ బెక్కుచోట్లఁ గలదు.

"తరముల్ నాల్గయి చెందు నెందునగుఁ, దత్తత్ గ్రామనామంబులన్
బరగున్ వంశము లెల్లఁ బూర్వపునిజప్రఖ్యాతి మాయంగ"

అను పింగళి సూరనార్యోక్తి యిప్పట్లఁగూడ సార్థక మైనదేమో? అట్లుగాక గద్యలో 'కలిదిండి' అని పడుట వ్రాయసకాండ్ర ప్రమాదమైనఁ గావచ్చును. ‘కలిదిండి' ప్రస్తుతము 'బందరు' పట్టణమునకు సుమా రిరువదిమైళ్లదూరమునఁ గలదు. ఆయూర నిప్పటికిని గోటయను పేర వ్యవహరింపఁబడు నొకప్రదేశము కలదు. అచ్చటఁ బూర్వ మొకదుర్గ ముండెనఁట. ఉండె ననుటకుఁ దార్కాణముగా నా ప్రదేశమున నిప్పటికిని గోడలయు, బురుజులయు జాడలు గలవు. రాచయమంత్రి యాదుర్గాధిపతియో, లేక కేవలము గ్రామకరణకుఁడో యయియుండును.

కాలము

ఈకవికాలమును నిర్ణయించుటకు గ్రంథస్థనిదర్శనము లేమియుఁ గానరావు. కాని యితరగ్రంథములో నొకదానింబట్టి కొంత యాధారము