పుట:విష్ణుపురాణము (కలిదిండి భావనారాయణ).pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గీ.

నందనుల నేడ్వురను గాంచి యందఱికిని, శాల్మలము పంచి యిచ్చె తత్సంజ్ఞ నేడు
వర్షములు దానఁ బరఁగెఁ దద్వర్తనంబు, తెలియఁజెప్పెద వినుము సందియము వీఁగ.

44


శాల్మలద్వీపేశ్వరుండైన వపుష్మంతునకు శ్వేతుండు, హరి, జీమూతుండు,
లోహితుండు, వైద్యుతుండు, మానసుండు, సుప్రభుండు నన నేడ్వురుపుత్రులు
గిలిగిరి. వారిపేర నేడువర్షంబులు గలిగె. కుముదంబు, ఉన్నతంబు, వలాహ
కంబు, సంజీవన్యాది మహౌషధులుగల ద్రోణంబు, శంఖంబు, మహిషంబు,
కకుద్మంతంబు నన నేడుమర్యాదాపర్వతంబులు; యోని, తోయ, అతితృష్ట,
పంచ, వృక్ష, విమోచని, నివృత్తి అను నామంబులుంగల యేడునదులు
సకలకల్మషనాశనులు గలవు. అందు కపిలారుణ, పీత, కృష్ణ, వర్ణంబుల
చాతుర్వర్ణ్యంబు బరఁగు.

45


గీ.

వాయుభూతుఁడైన వనజాతలోచను, నఖిలవర్ణజనులు ననుదినంబు
యజనశీలు రగుచు నర్చింతు రతిభక్తిఁ, దెలివి శాల్మలమను దీవియందు.

46


క.

దేవత లెప్పుడు మూడవ, దీవిన్ మానవులఁ గూడి దిరుగుదు రతిశో
భావహము శాల్మలద్రుమ, మావసుమతి నుండు నున్నతాకృతి యగుచున్.

47


వ.

అదియును లక్షద్వయయోజనవిస్తారంబు కలదు. తన్నాయంబునఁ గదా
శాల్మలద్వీపం బనం బరఁగు. చతుర్లక్షయోజనవిస్తారంబైన సురార్ణవం బా
శాల్మలద్వీపధరణిం జుట్టియుండు.

48


ఉ.

ఓపరమర్షిపుంగవ సురోదధిచుట్టునఁ బెంపుతోఁ గుశ
ద్వీపము పొల్చు నందుఁ గల ధీరజనుల్ దివిజోపమానులై
యేపున నుందు రందమగు నెన్మిదిలక్షలయోజనంబులన్
శ్రీవటమున్ దివస్పతిపురిన్ హరియించుచుండు నెప్పుడున్

49


వ.

కుశద్వీపేశ్వరుండైన జ్యోతిష్మంతునకు ఉద్యోగుండును, వేణుమంతుండును,
స్వరదుండును, లంబనుండును, ధ్రుతియును, ప్రభాకరుండును, కపిలుండును
నన నేడ్వురుకొడుకు లుదయించి రాజు లైరి. వారిపేరన సప్తవర్షంబు లయ్యె.
విద్రుమంబును, సోమశైలంబును ద్యుతిమంతంబును, పుష్పవంతంబును,
కుశేశయంబును, హరియును, మందరంబును నన నేడుపర్వతంబులు, ధూత
పాపయు, శివయు, పవిత్రయు, సమతియు, విద్యుద్ధంభయు, మహియు,
అన్యయు అనఁ గ్రమంబున నేడువర్షంబులందు నేడునదులు కలవు. దమన,
శుష్మనస్, స్నేహ, మందేహసంజ్ఞలంగల బ్రహ్మక్షత్రియవైశ్యశూద్రులు
స్వకర్మనిరతులై అనపేక్షుతకర్మఫలులై, బ్రహ్మరూపకుండైన జనార్దను య
జింతురు.

50