పుట:విక్రమార్కచరిత్రము.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రించు దక్షుఁడు. వృత్తకందము, కందవృత్తము, చతుష్కందము మున్నగు గర్భకావ్యవర్గనిర్మాణకుశలుఁడు. ఆంధ్రమునందుఁ బ్రబంధములు క్రొత్తలు పుట్టించుకొని (నూత్నకథలను గల్పించుకొని) లిఖించు ప్రతిభావంతుఁడు. అక్షరచ్యుతక , మాత్రాచ్యుతక , బంధచ్యుతకములును, నామగోప్య, క్రియాగోప్య, భావగోప్యములుగా పద్యములు చెప్పుటయందును, మఱియు సభలయందుఁ బద్యంబు గీతికార్భటిఁ జదువుటయందును చతురుఁడు. ఎల్లవిద్యల నెఱిఁగినవాఁడు. ఇతఁడు నెల్లూరి తిరుకాళవిభుని (నెల్లూరి మనుమసిద్ది తండ్రికినిఁ గుమారునకుఁ గూడ నీ పేరుగలదు) సభలో తన సాహిత్యపటిమను బ్రదర్శించి కీర్తిపాత్రుఁ డయ్యెను. ఇట్టి తాతకుఁ దగిన మనుమఁడు మన జక్కనకవి.

జక్కనకుఁ బూర్వపు నష్టప్రబంధములు

పై వివరములను బట్టి జక్కనకు సుమారు 50 సం. పూర్వమే ఆంధ్రభాషలో, ఆశు, బంధ, గర్భ, చిత్రకవిత్వములును, అవధాన (కవితా) విధానములును, మఱియుఁ బ్రఖ్యాత, మిశ్రమ, కల్పితేతివృత్తప్రబంధరచనమును బ్రచారమున నుండినట్లు తెలియవచ్చుచున్నది. జక్కన కూడ అవధానకవిత్వము చేయువాఁ డని కొందఱ అభిప్రాయము. తన తాత అవధానకవిత్వనిపుణుఁడని చెప్పెనే కాని, స్వవిషయమున అట్లెక్కడను జక్కన చెప్పలేదు.

ఇది చాలవఱకు వాస్తవమే యని తోఁచును. ఏలనఁ బ్రబంధకవులలోఁ బెద్దన హరికథాసారము మున్నగు ప్రబంధేతరగ్రంథములను గూడ రచించినట్లే పురాణయుగకవులును ఆ పురాణాదులు మాత్రమేకాక, ప్రబంధములను గూడ రచింపుచు వచ్చిరని యూహించుటకుఁ బ్రబలాధారములు కలవు.

లక్షణగ్రంథములయు దుదాహృతము లయిన పరిమితపద్యముల వలనను సాహిత్యచరిత్రల మూలమునను, నన్నయభట్టు రాఘవాభ్యుదయ, ఇంద్రవిజయము లను రెండుప్రబంధములను, తిక్కన ‘విజయసేన' మను బ్రబంధమును , ఎఱ్ఱన 'రామాయణ' ప్రబంధమును ('వల్మీకభవువచోవైఖరి రామాయణంబు నాంధ్రప్రబంధంబుఁ జేసె' నని చెదలువాడ ఎఱ్ఱాప్రెగడ); నన్నెచోడుఁడు 'కళావిలాస' ప్రబంధమును, నాచన సోముఁడు 'వసంతవిలాస' ప్రబంధమును మఱియుఁ జిమ్మపూడి యమరేశ్వరుఁడు 'విక్రమసేన' ప్రబంధమును రచించినట్లు తెలియవచ్చుచున్నది. కాని, యివి యన్నియు కాలవైపరీత్యముచే నష్టములయి మనకు లభింపకపోయినవి. ఈ గ్రంథములే యుపలబ్ధములయి యుండినచో 18వ శతాబ్దమునఁ బ్రబంధములు క్రొత్తఁగాఁ బుట్టిన వనునూహ సాహిత్యచరిత్రకారులకుఁ గలుగకుండెడిది.