పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

163

గీ. వీతహవ్యుమహిమ విను ధన్యమతులకు
     నఘము లణఁగు శుభము లగ్గలించుఁ,
     జిత్తశాంతి వొడము, చిన్మయానందసౌ
     ఖ్యంబు చెందు, నెపుడుఁ గమలనయన.265
వ. అని యిట్లు వీతహవ్యోపాఖ్యానంబు సవిస్తరంబుగా నెఱింగించి,
     యింకఁ జిత్తోపశమనప్రాప్తి పరిస్ఫుటం బగుటకు నాకాశగత్యభావో
     పాఖ్యానంబు చెప్పెదు నాకర్ణింపు మనిన విని రఘువుంగవుండు
     మునిశార్దూలున కి ట్లనియె.266
క. మునివర జీవన్ముక్తులు
     ననఘులు నాత్మార్థవిదులు నగువారలకున్,
     విను మంబరగత్యాదుల
     ఘనసిద్ధులమహిమ లేల కాన్పింపవొకో.267
సీ. అనిన వసిష్టుఁ డి ట్లను నభోగమనాది
                    కములైన సిద్ధులు గావు ముక్తి
     ద్రవ్యమంత్రక్రియాతత్కాలశక్తుల
                    నవిముక్తుఁడును బొందు నట్టిసిద్ధు,
     లాత్మజ్ఞునకు నవి యప్ర్రయోజకము, ల
                    య్యాత్మజ్ఞుఁ డెపుడును నాత్మవిదుఁడు,
     ఆతండు తనయాత్మయంద సుఖించుచు
                    నుండుఁ గాని యవిద్య నొందఁ డెందు,
గీ. నార్యు లివి యెల్ల మాయామయంబు లండ్రు,
     ఈజగద్భావములయందు నెల్ల నాడు
     విగతమాయాప్రపంచులు విగతమతులు
     ముక్తులును నైనపుణ్యలు మునుఁగ రెందు.268
వ. ఆత్మజ్ఞానవిదుం డయ్యు నెవ్వఁడే నిట్టి సిద్ధిజాలంబు బొందఁ గోరు