పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

143

వ. అదియునుం గాక, నేత్రాదీంద్రియంబులు వాసనారహితంబు లయిన
     బాహ్యార్థంబులం బ్రవర్తింప; వ ట్లగుట వాసన యకారణం బన
     రాదు, గావున మూర్ఖంబు లగువీని విడిచి యంతర్భావనం జెందు
     నంత నేదుఃఖంబులం బొరయక సుఖించెదు మనంబ.156
గీ. ఇట్టలంబుగఁ దముఁ దామె చుట్టుకొనుచుఁ
     బొత్తినూ లొనరించెడి పురువులట్ల
     వ్యర్థ మగుతృష్ణచేత దుర్వ్యథలఁ బొంది
     చెడితి రేమందు నింద్రియశిశువులార.157
క. నిండినయింద్రియధనముల
     భండారము నీవు; వానిఁ బట్టి యసత్తై
     యుండి నిను నీవ తెలిసి య
     ఖండామలబోధవీథిఁ గైకొను మనసా.158
వ. అని యనేకప్రకారంబుల నాలోకించి యమ్మునీంద్రుండు.159
సీ. పద్మాసనస్థుఁ డై పరమచిత్సుఖనిద్రఁ
                    గన్నార మోడ్చి, యోంకారరవము
     ఘాతితలాంగలఘంటికాఖండనా
                    దముభంగి బ్రహ్మరంధ్రమున మ్రోయఁ,
     గోరి ప్రాణాయామకుశలుఁ డై రేచక
                    మునఁ బ్రాణనిష్క్రాంతిఁ దనరి మేను
     కుంభసంభవనిపీతాంబోధిగతిఁ దోఁప,
                    హృదయపూరిత మైనచదలఁ బొల్చు
గీ. ప్రాణములఁ బేర్చి హృదయాగ్నిఁ బ్రబలఁ జేసి
     కాయ మేర్పించి, మరి కుంభకంబు నొంది
     క్రింద మీఁదను వెలి లోను సందు లేక
     పరఁగ నిస్తంద్రితము లైనభంగి నంత.160