పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

వాసిష్ఠరామాయణము

     వారణకుక్షిగతం బగు
     మారెడుబండ్లట్ల రూపుమాసెదు మనసా.152
క. ఆపాదమస్తకం బై
     చూపట్టిన తనువునందు శోధింపఁగ నిం
     దేపట్టున నేకాకిగ
     నేపురుషుఁడు నిలుచు నిందు నే నని మనసా.153
వ. అది యెట్లం లేని, యీప్రపంచం బంతయు సకలదిగ్భరితంబును సంవేద్య
     రహితంబును సర్వసంపూర్ణంబును నగు సంవిద్రూపంబుగాఁ దలం
     చెద. నది యింతంత యనుపరిమాణంబును నామపరికల్పనంబును నేక
     త్వంబు నన్యత్వంబు జడత్వంబు మహత్త్వంబు నేఱుపడక వేదనాఖ్యం
     బై స్వసంవేద్యంబును నైననాయందు నీయునికి దుఃఖకారణం బని
     వివేకజం బైనపరమజ్ఞానంబునం జేసి నిన్నుం దునిమెద. నదియునుం
     గాక.154
సీ. ఇది మాంస, మిది రక్త, మిది యస్థి, నిశ్వాస
                    మిదియు, నే ననుచుండు నెవ్వఁ డిందుఁ;
     బలరక్తకీకసస్పందముల్ వేర్వేఱ
                    యివియు నే ననుచుండు నెవ్వఁ డిందు;
     యిది జిహ్వ, యిది నాస, యివి కర్ణముల్, దృక్కు
                    లివియ నే ననుచుండు నెవ్వఁ డిందు;
     నివి యెవ్వియును గాక యింతయు నేక మై
                    యేన యుండుదు నొం డొకింత గలుగ;
గీ. దిది యసన్మయదృష్టి; యొం డెల్లఁ గాదు;
     ఏఁచె నజ్ఞానధూర్తు నన్నింతకాల;
     మాత్మచోరుని వీనిఁ బుణ్యమునఁ గంటి;
     నింత పరమార్థహాని ఖండింతు నేను.

155