పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

137

     యది యణంచినఁ దద్భ్రమ లంద వెందు.124
క. అది గాన లేచి యీగతిఁ
     బదిలం బై తప మొనర్పు. పదియేండ్లకు నీ
     కుదయించు దివ్యబోధం
     బది. యని కరుణించి విష్ణుఁ డరిగె నిజేచ్ఛన్.125
వ. అనంతరంబ యమ్మునికుంజరుండు వివేకజనితం బైన పరమవై రాగ్యం
     బు నొంది దయాయత్తచిత్తుండును నిరస్తాఖిలసంకల్పుండు నై యొక్క
     శిలాగ్రంబున నుగ్రతపంబు దశవత్సరంబు లొనరించి యాత్మజ్ఞానంబు
     నొందె. నని గాధివృత్తాంతం బతివ్యక్తంబుగా నెఱింగించి వసిష్ఠుం
     డి ట్లనియె.126
క. మాధవసేవారతుఁ డగు
     గాధిమునీశ్వరుని పుణ్యకథ విన నాధి
     వ్యాధులు పొందక చిత్తస
     మాధానము గలిగి మోక్ష మరచేతి దగున్.127
వ. అని చెప్పి మఱియు ని ట్లనియె. పరమం బగుయోగాభ్యాసంబునఁ గా
     ని చంచలం బగుహృదయంబు కుదురుపడదు. ఈయర్థంబున నుద్దా
     లకోపాఖ్యానంబు వర్ణింపంబడు. నాకర్ణింపుము.128
క. మును చిత్తాక్రమణం బను
     వినుతౌషధమునన గాక విను సంసారం
     బను దుష్టరోగ మణఁపఁగ
     నను వగునే యెట్టిభంగి నైనను రామా.129
క. క్రిందటి మీఁదటి కాలము
     లం దగులక వర్తమానలవమున బాహ్యం
     బొందిన బుద్ధిం గైకొని
     చెందిన చిత్తంబు దా నచిత్తత నొందున్.130