పుట:వాసిష్ఠరామాయణము (మడికి సింగన).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

వాసిష్ఠరామాయణము

     ననఘాత్ముఁడు జనకుఁ డిట్టు లని చింతించెన్.19
సీ. కటకట! యత్యంతకష్టతరంబులు
                    లోలంబు లైనయాలోకదశల,
     ఱాలపైఁ బొరలె డిఱాతిచందంబున
                    ననిశంబు బొరలుచు, నవధి లేని
     కాలంబునం దొక్కకళ యైన లేని యీ
                    బ్రతుకునకై పొక్కి పడెడునాకు
     నీరాజ్య మన నెంత? యింత యేమిటి? కిది
                    పాసియుఁ బాయక భ్రమలఁ బెట్టు
గీ. నిట్ట సంసారతరుమూల మీ మనంబు
     ఇదియ సంకల్ప మనఁబడు నిట్టిమనముఁ
     ద్రుంచి యీపాదపంబు నెండించువాడ,
     నేల మూఢునిగతి నాకు నిందుఁ దగుల?20
క. తెలిసితిఁ దెలిసితి; నిఁక నా
     తలఁపులు చేకూఱెఁ; బ్రజ్ఞఁ దరలించెడు నీ
     ఖలు నాత్మచోరుఁ జిత్తము
     బలిమి నిరోధించి త్రుంచి భ్రాంతి నణంతున్.21
క. దేవత లగునీసిద్ధులు
     వావిరిఁ దలపోయుసాధువాదంబుల ని
     ష్టావాప్తి యయ్యె; నానం
     దావృత మగునాత్మపదము నందెదఁ బ్రీతిన్.22
క. ఇది యే, నిది నాయది, యని
     మదిఁ బొడమెడు నహమికామముత్వము లుడిగెన్,
     హృదయరిపుఁ డణఁగె, శాంతియు
     విదితం బై తోఁచె, నోవివేకమ జేజే.23