పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

187


క.

హరిచరణకమలసేవా | కరణదృఢోత్సాహుఁడైన ఘనునకు వర్యా
చరణీయము, తులసీతరు | పరిణతదళపూజనంబు పార్థివతిలకా!

255


ఉ.

భూరిగురు[1]ప్రసాదమున బోధవివేకముఁ గొంత గాంచి, త
త్కారణపుణ్యకర్మములఁ దా నొనరింపుచు, శాంతిరత్నభూ
షారమణీయగాత్రుఁడయి, [2]సత్యమునందు నిజాంతరంగముం
గూరిమిఁ బాయనీక పని గొంట యవశ్యము బుద్ధిశాలికిన్.

256


క.

దానంబును, బుణ్యనదీ | స్నానంబును, దేవపూజ, సత్యము, సదను
ష్ఠానము ననియెడునవి సు | జ్ఞానమునకు సాధనములు జగతీనాథా!

257


క.

భక్తిజ్ఞానగుణద్వయ | యుక్తుండై తనరు సజ్జనోత్తమునకు, నా
సక్తమతి నొసఁగు శ్రీహరి | [3]ముక్తివధూయోగసౌఖ్య మును జననాథా!

258


క.

హరి దైవము, హరి దైవము, | హరి దైవము సుమ్ము! నమ్ము, మవనీశ్వర! యా
హరిఁ గొలువు, మమ్మహాత్ముఁడు | కరుణానిధి [4]నీకు నొసఁగుఁ గైవల్యంబున్.

259


మ.

అని బోధింప, వశిష్ఠమౌనివచనవ్యాప్తిన్ మయూరధ్వజుం
డును చిత్తంబు కలంకదేరిన, గరిష్ఠుండై వశిష్ఠాదిస
న్మునుల న్వీడ్కొని, దుష్టమోహలత నున్మూలించి, లక్ష్మీశ్వరున్
వనజాక్షు న్మదిఁ బాదు కొల్పి, యితరవ్యాపారనిర్ముక్తుఁడై,

260


క.

పంచజనోద్భవధరు నా | పంచాస్త్రగురున్ భజించి, భావించి, తగన్
బంచమదినమున నాతఁడు | పంచత్వము నొంది పరమపదముం గనియెన్.

261


వ.

ఇవ్విధంబున మయూరధ్వజుండు హరిపురప్రాప్తుం డగుటయుఁ, దత్కుమారుం
డభిషిక్తుండై, రాజ్యంబు సేయుచుండె నని, కై వల్యఖండ[5]మాహాత్మ్యంబు వివరించిన,
మార్కండేయాదిమునీంద్రులు రోమశు నభినందించి, యనంతరంబ, విజ్ఞానఖండశ్రవణ
కుతూహలులై యుండి రవధరింపుము.

262
  1. ప్రదానమున - మ, తారా, తి, తీ,హ ,ర,క
  2. సత్త్వము - తా, తి, తీ
  3. ముక్తిదమాయోగ - త
  4. నీ కొసంగు - తీ
  5. మహత్త్వంబు - మ, మా,హ,ర