పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

వరాహపురాణము


క.

మానసవాక్కాయేంద్రియ | మానోత్పాదితములైన మహితాఘతతుల్
మానవులకుఁ బుణ్యనదీ | స్నానంబున నణఁగు నఖిలసన్నుతచరితా!

246


తే.

మాఘమాసమునందుఁ దామరసహితుఁడు | గొంతయుదయించునప్పుడు కువలయమునఁ
గల జలంబెల్లఁ బావనం బలఘుచరిత! | [1]స్నానమాడిన జనుల పాతకము లణఁచు.

247


ఆ.

మకరమాఘమందు సకలతీర్థంబులు | నమరనదికి సమము లండ్రు బుధులు,
గాన, సలిల మెచటఁ గలిగె నచ్చోఁ గృత | స్నానులగుట మేలు సజ్జనులకు.

248


క.

దీనులకు నన్న మిడుటయు, | దానము సత్పాత్రమందుఁ [2]దగఁ జేయుటయున్
మానవులకు నిత్యాను | జ్ఞానము, లివి రెండు సుగతిసాధక[3]తమముల్.

249

విష్ణుపూజావిశిష్టత

చ.

సకలమునందు నుండు హరి, సర్వమయుండు, సమస్తజీవులం
దొకరుఁడ సాక్షియై తిరుగుచుండుఁ బ్రబోధత నొంది, ముక్తిదా
యకుఁడగు నవ్విభుం గడవ నన్యుఁడు లేఁ, డది గావునన్, శిలా
దికముల [4]శ్రీపతిన్ బుధులు ధీరతఁ బూజ యొనర్పఁగాఁదగున్.

250


క.

సిరియును నాయువుఁ దేజముఁ | బరమనివాసంబు [5]నొసఁగఁ బాల్పడి, లక్ష్మీ
శ్వరుఁడు నిజదాసు లున్నెడ | [6]నిరవుగ వర్తించుఁ బాయఁ డెచ్చటనైనన్.

251


క.

అతులశిలాలోహాది | ప్రతిమల హరి నావహించి, భక్తి దలిర్పం
బ్రతిదినమును బూజించిన | యతఁ డేఁగు న్విష్ణుపురికి నధికవిభూతిన్.

252


క.

[7]ప్రణవాదినమోంతములగు | ఫణివల్లభతల్పశయను బహు[8]నామములన్
బ్రణుతించి, కృష్ణతులసీ | [9]మణిదళములఁ బూన్చునతఁడు మాధవుఁ జేరున్.

253


సీ.

శ్రీభర్త నొకతులసీదళంబునఁ బూజ | గావింప [10]నుపపాతకంబు లణఁగు,
వారిజాక్షుని దళద్వయమునఁ బూజింప | స్వర్ణచౌర్యాదిదోషములు దొలఁగు,
దనుజాంతకుని దళత్రయమునఁ బూజింప | బ్రహ్మహత్యాదిపాపంబు లడఁగు,
జలజనాభుని జతుర్దళములఁ బూజింప | నింద్రుఁడై సురలోక మేలుచుండుఁ,


తే.

బంచదళముల భక్తిసంపన్నుఁ డగుచుఁ | బంచసాయకగురుని బూజించునట్టి
పరమపుణ్యుఁడు వైకుంఠపురి వసించు, | నంతమీఁదటిఫలము శ్రీహరి యెఱుంగు.

254
  1. తానమాడిన - మా, త, తా, తీ
  2. దగుఁ - మ, మా, హ, ర
  3. తరముల్ - మ, త
  4. శ్రీరమాపతిని ధీరత - త; శ్రీపతిందలఁచి - మా
  5. నొసఁగు - మ, తి, తీ, హ, ర, క
  6. నిరువు - తా
  7. ప్రణవాదిని మొత్తములగు - తీ
  8. మానములన్ - తీ
  9. మణులం బూజించునతఁడు - తా
  10. నృప - తీ, హ, ర