పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/281

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

185


ఉ.

ఏనదిఁ దీర్ధమాడి నరుఁ డేచినకర్మ[1]చయంబుఁ ద్రుంచు? నే
దానమున న్నశించు దురితంబులు? లెస్స యొనర్ప నేయను
ష్ఠానము ముక్తి నిచ్చుఁ? బ్రకటంబుగ నెవ్వనిసేవ స్వర్గసో
పానము? దేనఁ బొందుపడు భావము? పుణ్యము నెట్టిదింపగున్?

237


వ.

ఈసూక్ష్మార్థంబులు నిర్ణయించి, యిందఱు [2]నేకవాక్యంబుగా నానతిండనిన, నఖిల
ముని సమ్మతంబున వశిష్ఠుం డిట్లనియె.

238

పరమధర్మప్రబోధము

క.

అన్నోదకదానంబులు | సన్నుతములు సకలదానసారము, [3]లవి యా
పన్నులకు నిచ్చిరేని స | మున్నతగతి నిహపరంబు లొసఁగం జాలున్.

239


ఆ.

అగ్నిహెూత్రకాల మప్పుడు, భుజియింపఁ | బోవునపుడు, దేవపూజయపుడు,
నన్నకాంక్షి యగుచు నతిథి యేతెంచిన | నతని కిడనివాఁడె యంత్యజుండు.

240


తే.

అలసి,మధ్యాహ్నసమయంబునందు నింటి | కతిథి యేతెంచి, విఫలప్రయత్నుఁ డగుచు
[4]మరలిపోయినఁ, దద్గృహేశ్వరుఁడు మునుఁగు | నిరయదారుణదుఃఖసాగరమునందు.

241


క.

ఓదన మొసంగియైన, స | మాదరమున జలము వోసి యైనను హృదయా
హ్లాదముగ నతిథిఁ బ్రోచిన | యాదొరకున్ దొరకుఁ బుణ్య మతిసులభమునన్.

242


ఆ.

తెరువు [5]నడిచి యలసి ధృతిదప్పి మధ్యాహ్న | కాలమందు నన్నకాంక్షి యగుచు
నరుగు దెంచినట్టి యభ్యాగతుండె నా | రాయణుండు, శుభ పరాయణుండు.

243


ఆ.

పరమపుణ్యుఁడైనఁ, బాపాన్వితుండైనఁ, | గులజుఁడైన, నీచకులజుఁడైన,
బ్రహ్మవేదియైన, [6]పతితాత్ముఁడైన నాఁ | కొన్నవాఁడె పాత్రుఁ డన్నమునకు.

244


సీ.

ఏకపత్నీవ్రతవ్యాకోచచిత్తుండు, | [7]దాంతుండు, విమలసంతానయుతుఁడు,
[8]విశదకర్మాచార[9]విధిమూర్తి, శుద్ధాత్ముఁ, | డన్యకాంతాధనాద్యస్పృహుండు,
వైష్ణవమార్గవిశ్వాససంపన్నుండు, | హరిమంత్రభజనపరాయణుండు,
[10]నగ్నిహెూత్రాదిక్రియాసమర్థుఁడు, శాంతి | పూర్ణుఁ, డుత్తమవిప్రపుంగవుండు


తే.

నఖిలదానంబులకుఁ బాత్రు లనఘచరిత! | విష్ణుసంప్రీతిగాఁ బూని, వీరి కిచ్చు
దాన మత్యంతశుభఫలదాయకంబు | గానఁ, బ్రత్యహదానసంగతుఁడ వగుము.

245
  1. జయంబుదించు మ, మా, త, తి, తీ, హ, ర, క
  2. నైకకంఠ్యంబుగా - తీ
  3. లది - తా, భిన్న ప్ర.
  4. తరలి - తీ
  5. దప్పి - తి,తీ
  6. బ్రహ్మఘ్నుడైన - త
  7. దాత్తుండు - మ, మా, తి, తీ, హ, ర, క
  8. విశ్వ - త
  9. కృతమూర్తి - త. భిన్న ప్ర.
  10. నగ్నిసూత్రప్రక్రియా - తా