పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

వరాహపురాణము


సీ.

తలఁకక చేరలంతలు నేత్రములు దాల్చి | కొణిదెఁడుమొగ మెట్లు కుదురుపడియె?
నీ[1]యెత్తుఱోలు పాలిండ్లభారము పూని | చీమంతనడు మెట్లు [2]శేఖరించె?
గురుతరంబైన యీక్రొమ్ముడిపెనుమోపు ! నన్నువగళ మెట్టు లానుకొనియె?
[3]గుఱివెట్టరాని యీపిఱుఁదువ్రేఁగునఁ జిన్ని | పదము లెట్టులు తొట్రుపడక నిలిచెఁ?


తే.

బ్రకటలావణ్యరససముద్రంబు నెట్లు | రమణఁ దనువల్లి తనయందు నిముడ [4]నేర్చె?
భూరి శృంగారరసము నద్భుతరసంబుఁ | గలిపి, యీ తన్విఁ జేసెనో కమలభవుఁడు?

216


ఉ.

తీపులవింటివాఁడు భువిఁ ద్రిమ్మర నంపినయట్టి మాయ యీ
రూపము దాల్చెఁగాక, యిది రూపవతీమణి యయ్యెనేని, నా
చూపులవెంటనే మనసు చొచ్చుట యెట్లు? మనంబు సొచ్చెఁబో,
లోపల [5]నుండుఁగాక, వెలిలోచనమార్గముఁ [6]బాయ దెట్టొకో?

217


తే.

అకట! మాతంగకన్యక యగుట, దీని | నంటరాదని శంకించు టనుచితంబు,
బాహ్యమున నంటకయ మున్న భావవీథిఁ | గాంతతోఁ గూడి క్రీడింపఁ గనినపిదప.

218


చ.

అని తలపోసి పోసి మదనానలవేదనఁ గ్రాఁగుచున్న యా
జనపతిఁ జేరి, యాయధమజాతివధూమణి, తద్గళంబున
న్వినుతమధూకమాలికఁ దవిల్చె, నతండును బెండ్లియాడె, నే
మనఁగల దింకఁ, బాపభయ మాత్మఁ దలంతురె కాముకాధముల్?

219


శా.

చండాలప్రమదావివాహకలనాసంతుష్టుఁడై, యన్నరేం
ద్రుండశ్రాంతము మద్యపానరతుఁడై, దుర్బుద్ధి, గోమాంసస
త్ఖండంబుల్ భుజియింపుచు న్వరుస నాకంజాక్షితో నిక్షుకో
దండక్రీడలఁ దేలుచుండె మణిసౌధంబందుఁ [7]జేరిచ్చలన్.

220


ఉ.

ప్రేమ దలిర్ప నిట్లు విహరింపుచు, బుత్రశతంబుఁ గాంచి, యు
ద్దామవిభూతిఁ దత్తదుచితంబుగఁ బూని, వివాహకృత్యముల్
భూమివిభుం డొనర్చి, నిజపుత్రులుఁ బౌత్రులుఁ దాను భార్యయున్
దామరతంపరై కడుముదంబునఁ దేలుచునుండు నత్తఱిన్.

221
  1. యెత్తుకోలు - మా,త
  2. శేకరించె - మా; శీకరించె - త; స్వీకరించె - తా,క: సేకరించె - తి,తీ,హ
  3. గురువైనయట్టి యీ - తీ
  4. ఁజేసె - తీ; ఁగొనియె - త
  5. నుండెఁగాక - అన్ని తాళ. ప్ర: నుండు టెట్లు-తీ
  6. బాయుటెట్లోకో - తీ
  7. బేరిచ్చలన్ - మా; వర్తింపుచున్ - తీ