పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

181


తే.

వినుము భూపాల! మత్పుత్రి వనజగంధి | కమలహూతి [1]యనా నొక్కకన్య గలదు,
రూపలావణ్య మధురానులాపసుగుణ | రత్నమంజూష, దానికి రమణు లీడె?

208


సీ.

తలిరుజొంపముల మార్దవము, కాంచనకాహ | ళముల పొంకము, కరభముల తీరు,
ఘనసైకతము పెంపు గగనంబు సొబగును, | సుడిపొల్పు తరఁగల సోయగంబు,
కాలోరగము చాయ, కరికుంభముల మేలు, | లతల చెల్వము , శంఖ[2]లక్షణంబు,
పవడంపుఁగెంపు, చంపకము లావణ్యంబు, | తొలకరి మెఱుఁగుల వలనితళుకు,


తే.

[3]ముకురముల సొంపు, శ్రీకారముల తెఱంగు | విదియచందురు బాగు, తుమ్మెదల [4]కప్పు
గూర్చి, శృంగారరసముఁ బైఁ గ్రుమ్మరించి, | రమణిఁ గావించెఁ గాఁబోలుఁ గమలభవుఁడు.

209


క.

వేయును నేటికి? ధరణీ | నాయక! సౌందర్యముఖగుణంబుల నీ కా
తోయజవదనామణి తగు, | నా[5]యతివకు నీవ తగుదు వారసి చూడన్.

210


తే.

‘రత్నములలోనఁ గామినీరత్న మధిక’ | మనుచు వర్ణించు శాస్త్రంబు మనుజనాథ!
సౌఖ్యములలోన [6]నంగనాసౌఖ్యసుఖము | ధన్య, మిది సర్వజంతుసాధారణంబు.

211


ఉ.

హీనకులంబుమానవుని యింట మనోహారరత్న మున్న, నే
[7]పూనికనైనఁ గైకొనుట భూవరధర్మము, విన్ము, కాముకుం
డైనఁ గొఱంత యేమి? ‘కమలాసన శంకర మాధవుల్ సదా
మానవతీసమేతు’ లను మాట యెఱుంగవె రాజపుంగవా!

212


క.

వేదాధ్యయనపరుండగు | భూదేవున, కంత్యజునకుఁ బోలింపఁగ ను
త్పాదనగేహం బొకటియ | భేదము. లే, దిందుఁ బెద్దపిన్ననఁ గలదే?

213


వ.

అని పలికి, యాసిద్ధపురుషుండు తనతనూభవ రావించి, యమ్మహీపతి సమ్ముఖంబున
నిలిపిన, నామయూరధ్వజుండు నయనానందకందంబగు నాయిందుముఖి సౌందర్యం బవలో
కించి, యంతర్గతంబున,

214

చండాలప్రమదాసమాగమము

శా.

లావణ్యామృతవృష్టి, మోహనకళాలక్ష్యంబు, శృంగారపా
రావారంబు, మనోజరాజ్యఫలసర్వస్వంబు, సౌందర్యవ
ల్లీవిభ్రాజితమూలకంద, మిది పోలింపంగఁ జంద్రాస్యయే?
యీవామాక్షి [8]భజించువాఁడు [9]నృపదేవేంద్రుండు గాకుండునే?

215
  1. యనఁగ - తీ
  2. తతిగరిమము - తీ
  3. ముకుళముల - తా భిన్న ప్ర,; కుముదముల (యతి?) - త
  4. పెంపు - మా. భిన్న ప్ర.
  5. యింతికి - తీ
  6. కామినీ - తా
  7. పూనికె - మ, త, తా
  8. భుజించు - తా
  9. మహి - తి,తీ