పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

వరాహపురాణము


చ.

జలజ[1]లతాంతము ల్విరిసెఁ, జల్లనివాయువు వీచెఁ, బుల్గుమూఁ
కల కలనాదముల్ చెలఁగెఁ, గైరవముల్ ముకుళించె, వెన్నెలల్
పలపలనయ్యెఁ, దారల నెపం బణఁగెన్, శశి గ్రుంకె నేర్పడం,
బలబల తెల్లవాఱె, రతిబంధమునం జెలరేఁగె [2]జక్కవల్.

201


ఉ.

దారుణసాంధ్యరాగశిఖిఁ దప్తము చేసి, ప్రభాతకారకుం
డారసి, పూర్వశైలశిఖరాగ్రపు[3]దాగటిమీఁదఁ దేజపుం
గాఱున నిడ్డ నొ ప్పెసఁగు క్రాఁగిన లోహపుముద్ద నాఁగ, జం
భారిదిగంతసీమ జలజాప్తుఁడు మించె ను[4]దీయమానుఁడై.

202


వ.

ఇట్లు సూర్యోదయం బగుటయుఁ దత్ప్రాంతంబున,203
క. మధుసమయకుసుమసముదయ | మధురసనిష్యందపానమదకలగుంజ
న్మధుకరమిథునమృదుస్వన | మధురిమ గల కొలను గనియె మహిపతి యెదురన్.

204


వ.

కాంచి, యాకాసారంబునం గాలోచితకృత్యంబులు దీర్చి, జలంబులు గ్రోలి,
వటమూలంబునకు వచ్చి, యెప్పటియట్ల యుండునంత,

205

సిద్ధపురుషుని తామసవిక్రియ

సీ.

భైరవార్పితదివ్యవారుణపూరంబు | నుత్సాహగరిమ [5]గ్రుడ్లుఱకఁ ద్రావి,
చాలమత్తత గొని నాలుక తిరుగక | తడఁబడ నేమేని నొడువుకొనుచు,
నడుగులు తొట్రిల్లఁ బడఁబారి గొబ్బున | బయలూరఁగొనఁ జూచి బార లిడుచు,
మద్యదుర్గంధసంపద చోడుముట్టంగ | హాస్యకారంబు పె క్కైన నగుచు,


తే.

నిక్కి వెస నావులింపుచు నీలుగిలుచు, | [6]బండులాడుచుఁ, [7]దారశబ్దములు బెళుక
నుగ్గళింపుచు, లజ్జావియోగియైన | సిద్ధవరుఁ డొక్కఁ డారాజుఁ జేరవచ్చె.

206


తే.

వచ్చి, యాసిద్ధవరుఁడు భూవరుని [8]గాంచి, | యతని కులగోత్రనామంబు లడిగి, ధాత్రి
జాఁగఁబడి మ్రొక్కి, పలుమఱు సన్నుతించి, | పలికె నొకమాట సంతోషభరితుఁ డగుచు.

207
  1. నితాంతము - మా
  2. జక్కువల్ - మ,మా, తా,హ,ర,క
  3. ఁదా గడి - తీ
  4. దీప్యమానుఁడై - తా, తి, తీ
  5. గుండురుక - మ,త, తా, క; గుడ్డురక - మా,ర
  6. బంతు - మ,మా,హ,క; బూతు (యతి?) - తా; బాతు - త, తి , తీ,ర
  7. తాన - త; దాళ - త. కంటె భిన్న ప్ర.
  8. డాసి - మా