పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

179

సాయంసమయవర్ణనము

చ.

కమలినిఁ, బుష్పిణి, న్మధువికారవతిన్, ద్విజరాజదూషితం
బ్రమదముతోడఁ గూడి, [1]యనురాగవశంబునఁ గ్రీడసల్పఁగా,
నమరఁగ రక్తమయ్యె నని, యంబరము న్విడనాడి, వార్ధిలో
దుమికే శరీరశుద్ధి కనఁ, దోయరుహాప్తుఁడు గ్రుంకె [2]నత్తఱిన్.

195


చ.

గిరిగుహలందుఁ, [3]గంజముఖికిన్ గచభారములందు, మత్తమ
ట్చరణములందు, నీలమణిజాలము నందుఁ, గురంగనాభియం
దిరువుగ దాఁగి, చండకరుఁ డేఁగిన, నొక్కటఁ గూడి, మొత్తమై
దిరదిర నేఁగుదెంచె నన, దిక్కులఁ బర్వె ఘనాంధకారముల్.

196


తే.

సరస రాత్రివధూమణి చంద్రగళిత | చంద్రికాసవగండూషసంగమమున
నిగిడి పూచిన మి న్ననుపొగడచెట్టు | పుష్పములభాతిఁ, దారలు పొడిచి యొప్పె.

197


చ.

సలలితతారకాకుసుమజాలము దట్టము గాఁగ, నంబర
స్థల మనుపాన్పుపై నెఱపి, [4]చల్లనివెన్నెలజాలుతుంపురు
ర్చిలికి, మనోభవుండు పవళించుటకై , యిడినట్టి శుభ్రపుం
దలగడబిళ్లవోలె, హిమధాముఁడు పొల్చె సురేంద్రదిక్తటిన్.

198


వ.

ఇట్లు ప్రభాసాంద్రుండగు చంద్రుం, డుదయాచలతుంగ[5]శృంగంబు నలంకరింపం
గనుంగొని, మయూరధ్వజుండు తృష్ణానలతప్తుం డగుచు, నిజరాజ్యధనవనితా[6]తనయాదులం
దలంచి, తన మనంబున,

199


సీ.

ఔషధం బెద్ది పద్మాననాలోకవి | యోగతాపజ్వరరోగమునకుఁ,
[7]దేప యెయ్యది పుత్రరూపనిరీక్షణా | హర్షరాహిత్యదుఃఖాంబునిధికిఁ,
బ్రబలవర్షం బెద్ది బంధుసంభాషణో | త్సాహ[8]దూరీభావదావశిఖికిఁ,
గుద్దాల మెయ్యది కోవిదహితమిత్ర | విరహసంభవఖేదవిషమలతకు,


తే.

నకట! దైవంబు ప్రతికూల మగుచు నిటకుఁ | దెచ్చె, నీశోక మెవ్వరు దీర్ప నేర్తు
రనుచుఁ, గనుమూయ మేల్కొన నలవి గాక | కళవళింపుచు నారాత్రి గడపె విభుఁడు.

200
  1. యును రాగరసంబున - త
  2. నంతటన్ - తీ
  3. వారిజదళాక్షుల కేశములందు (యతి?) - తా
  4. చల్లన - తా,తి, తీ
  5. శిఖరంబు - తీ
  6. సుతాదులం - తీ
  7. దీప - తీ; దెప్ప (యతి?) - తీ. భిన్న ప్ర.
  8. భూరిదాహ మ ర క; భూరిధావ - మా; భూరిదాహ - త దూరదుర్గావ (హ?) - తి, తీ; దూరీదావ - హ