పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/273

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

177


తే.

అర్థి చే సాఁచి వేఁడిన యాక్షణంబ | వాంఛితార్థంబు లీనేర్చువాఁడె దాత,
పార్థివోత్తమ! యొకవిన్నపంబు గలిగి, | వచ్చినారము యాచకత్వము భజించి.

179


చ.

వినుము నరేంద్ర! లోకమున వృష్టి యొకింతయు లేమిఁ జేసి, భూ
జనులు నశింపఁ దత్కలుషశాంతికి నూహయొనర్చి, వర్షసా
ధనమగు యాగ మొక్కటి ముదంబున నింద్రునిగూర్చి చేయఁగాఁ
జనునని నిశ్చయించి, ధనసంచయనార్థము నిన్ను వేఁడఁగన్.

180


క.

హృదయమునఁ దలఁచి వచ్చితి | మిది మాయభిలషితకార్య, మిట నిష్కములం
బదివేలకో ట్లొసంగక | తుదిముట్టదు మఖము, విఘ్న[1]దూష్యం బగుచున్.

181


వ.

కావున, దత్పరిమితవిత్తం బొసంగిన సంప్రాప్తకాములమై నిజాశ్రమంబుల కరిగెద
మని పలికిన వశిష్ఠాదిమునీంద్రుల భాషణంబు లాకర్ణించిన యాక్షణంబ.

182


క.

ఆరాజవరుని ప్రాణస | మీరము వెడలంగ నుద్యమించెను, లోభా
ధారులకు నర్థివాక్యము | మారణమంత్రంబు గాదె మహి నూహింపన్?

183


చ.

ఘనతరకష్టలోభిఁ, దమకంబునఁ జంపెడునంత యల్క నె
మ్మనమునఁ బుట్టెనేని, విషమారణకర్మ కృపాణముఖ్యసా
ధనములు గూర్పనేల? ప్రమదంబున డగ్గఱి, కాసు వీస మి
మ్మనుటయె చాలు వాని నిమిషార్ధమునన్ మృతిఁబొందఁజేయఁగన్.

184


చ.

వినుము మునీంద్ర! యిట్లు పృథివీవరు ప్రాణము నిర్గమింపఁ జూ
చిన కథ లాత్మలం దెఱిఁగి, శీఘ్రమ మంత్రితవారిపూర మా
జనపతిమీఁద నమ్మునులు చల్లిన, నాతఁడు నిద్రితాత్ముఁడై,
కనుగవ మూసి, యొక్కకల గాంచె మహాద్భుతదర్శనంబునన్.

185


వ.

[2]తదీయస్వప్నకథాక్రమం బెఱింగించెద నాకర్ణింపుము.

186

విచిత్రస్వప్నకథ

చ.

అరిజయశాలి యానరవరాగ్రణి, కొల్వున నున్న యత్తఱిన్
గరువలిమేను దాల్చి, [3]తగ గర్వము చూపఁగ నేఁగుదెంచిన
ట్లరుదుగ నుత్తమాశ్వ మొక టాసభకుం జనుదేర, విక్రమా
భరణుఁడు గాంచెఁ [4]బో పసిఁడిపల్లముతోడి తురంగరత్నమున్.

187
  1. దూరం - మా,త, తా
  2. తత్కలక్రమం - తా
  3. తన - మా
  4. బొంబసిఁడి పగ్గము - త; క్రొంబసిఁడి - మా, తా