పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

175


మ.

మదము న్మచ్చరముం బ్రమోదమును గామక్రోధలోభంబులున్
మది నుప్పొంగ నతండు దానమును ధర్మంబుల్ విసర్జించి, దు
ష్టదశా[1]సంయుతుఁడై, యనిత్యమగు సంసారంబు నిత్యంబుగా
హృదయంబందుఁ దలంచి, యర్థము లుపార్జించెన్ దయాశూన్యుఁడై.

162


ఉ.

పాడి దొఱంగి, యాధరణిపాలకుఁ డిట్లు ధరిత్రి యేలఁగా
[2]గోడని భూప్రజల్ వగలఁ గుందిరి, వానలు వోయె, సస్యముల్
వాడె, ఫలద్రుమంబులును వంధ్యము లయ్యెను, గోగణంబు పా
లీడినఁ దన్నుకోఁదొణఁగె, నే మని చెప్పుదు మౌనిశేఖరా!

163


తే.

రాజదోషాతిశయము కారణము గాఁగ ! సత్యధర్మదయాదులు సమసిపోవ,
ద్వాదశాబ్దంబు లుర్విపై వాన లేక | భూప్రజావళి దుర్భిక్షమున నశించె.

164


క.

యాగహవిర్భాగపరి | త్యాగం బొనరించి, రధికయత్నంబునఁ దే
జోగుణయుతులగు నింద్రపు | రోగము లిటు [3]కఱవు సంప్రరూఢం బైనన్.

165

వసిష్ఠాదిమునీంద్రుల యాగమనము

క.

ఆయెడఁ గౌశిక శాలం | కాయన జాబాలి హరిత కాత్యాయన వా
త్స్యాయన వల్మీక భవా | త్రేయ వశిష్ఠాది సకలదివ్యమునీంద్రుల్.

166


సీ.

రయమున బదరికాశ్రమభూమి కందఱుఁ | జేరి, యనావృష్టికారణంబు
నృపతిదోషంబుగా నిపుణత నూహించి, | తద్దోషశాంతి కుద్యమ మొనర్చి,
[4]హేమపురప్రాంతసీమకు నరిగి, బృం | దావనదీర్ఘికఁ దాన మాడి,
సంధ్యాదు లొనరించి, సపవిత్రపాణులై | పురి చొచ్చి, రాజమందిరము చేరి,


తే.

ద్వారమున నిల్చి, రప్పుడు వారిరాక | విభుఁడు దౌవారికుఁడు విన్నవింపఁ దెలిసి
నెదురు చని, యామహాత్ముల, నిద్ధయశుల, | మునుల నభ్యంతరాలయంబునకు దెచ్చి,

167


క.

పరమార్ఘ్యపాద్యముఖ్యా | చరణంబుల నతిథివిహితసత్కారములం
బరితృప్తులఁ జేసి, మనో | హరపీఠములందు [5]నునిచి యాదర మెసఁగన్.

168
  1. సంయుతమై యనీమమగు - మ, మా, తి, తీ,హ,ర,క
  2. గూడిన - తా
  3. కరము - తీ
  4. సోమపుర - అన్ని ప్ర.
  5. నిలిపి - తీ