పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

174

వరాహపురాణము


మ.

గురువే దైవముగాఁ దలంచి, మదిలోఁ గోర్కెల్ విసర్జించి, త
ద్గురువాక్యప్రతిభావిశేషమునఁ జేతోజాతసందేహదు
స్తరదుర్వారతమిస్రముం జెఱచి, నిస్తంద్రాత్ముఁడై, యిందిరా
వరునిం గొల్చినవానికిం గలుగు నిర్వాణంబు మౌనీశ్వరా!

158


వ.

వినుము. జీవుండు పాంచభౌతికదేహసహితుండై యనేకజన్మావసానంబున మను
ష్యత్వంబు నొంది, త్వక్చక్షుఃశ్రోత్రజిహ్వాఘ్రాణవాక్పాణిపాదపాపాయూపస్థాహ్వయదశేం
ద్రియసహితమనో[1]వ్యవహారవికారంబుల నణంచి, క్షణభంగురంబగు పుత్రదా ధనాది
సంగం బంగీకరించియుఁ, దజ్జనితసుఖదుఃఖంబులయెడ సమత్వం బవలంబించి, యాధ్యాత్మి
కాధిదైవికాధిభౌతికంబు లనం బరఁగు తాపత్రయంబువలనం బొడము వగలం దగులుపడక,
కులమద విత్తమద విద్యామద రూపమద భోగమద శౌర్యమద పుత్రమదంబులం బరగు సప్త
మదంబులం [2]బొదలక, పరవిత్తకాంతాదులయం దాసక్తి యొనర్పక, గురుముఖంబున లక్ష్మీ
వరునిఁ బరతత్త్వంబుగా నెఱింగి, తద్భక్తజనస్నేహంబును, దద్గుణాకర్ణనంబును, దత్ప్రతిమా
విలోకనంబును, దత్పాదతీర్థసేవనంబును, దత్పూజాపారతంత్ర్యంబును, దత్సమర్పితాన్న
భోజనంబును వదలక, భక్తియోగకర్మయోగంబులం బరమాత్మభావనాపరుండై, బాహ్య
జ్ఞానంబు మఱచి, సర్వసముండై, వర్తించునతండు విష్ణుసాయుజ్యంబు నొందు.

158

మయూరధ్వజోపాఖ్యానము

వ.

తొల్లి మయూరధ్వజుం డన నొక్కభూభుజుండు మునివచనప్రభావంబున నైదుదినం
బులన మోక్షంబు గాంచె. తత్కథావిశేషంబు చెప్పెద నాకర్ణింపుము.

159


చ.

కరిరథ[3]వాహవీరభటగర్భితసర్వపదంబు, రత్నగో
పురవరసౌధవప్రరుచిపుంజవిచిత్రిత సర్వదిక్కమున్,
సరసపదార్థ పూరితము, సంతతవైభవసంయుతంబునై
యిరవగుఁ బట్టణం బొకటి హేమపురం బన, దివ్యసేవ్యమై.

160


క.

భుజనిశితాసిభుజంగీ | [4]భుజకర్మీకృతవిరోధి భూభుజుఁడు, కుశ
ధ్వజతనుజుండు, మయూర | ధ్వజుఁ డనురా జేలుచుండు దత్పురవరమున్.

161
  1. వ్యాపార - త
  2. బొరలక - తీ
  3. వాజి - తీ
  4. భుజవల్మీ - హ; భుజకర్మీకృత - ఇతర ప్ర.