పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

173


శా.

ఆదిత్యామృతధామవంశభవులై యజ్ఞానులై, పుత్రకాం
తాదుర్మోహనిబద్ధబుద్ధు లగుచున్, దర్పాంధులై రాజ్యముల్
మోదంబొప్పఁగ నేలు దుష్టనృపు, లంభోజాక్షసద్భక్తిపూ
జాదూరస్థితులై నశించిరి, వృథా సంగ్రామరంగంబులన్.

152


తే.

ఉభయవంశంబులందు ని ట్లుద్భవించి, | చనిన మనుజేశ్వరుల వస్తుజాల మెల్ల
విలయమును బొందెఁ గాని, తద్విభులవెంట | నరుగ దొకటైన నందు సత్పురుషవర్య!

153

సంసారాసారపరిజ్ఞానము

సీ.

కావున, మనుజత్వకలితుఁడై యైశ్వర్య | దారాదిమోహబంధములఁ బడక,
పాంచభౌతికదేహభావసౌఖ్యంబులు | [1]క్షణభంగురము లను సరవిఁ దెలిసి,
సంగ్రహించిన వస్తుసమితిలో [2]నొకటైనఁ | దనవెంటఁ గూడి రాదనుచుఁ దలఁచి,
సద్గురుకరుణచే సర్వాంతరస్థాయి | హరి జగన్మయుఁడని యాత్మ నెఱిఁగి,


తే.

చక్రిరూపంబు నేత్రలక్ష్యంబు చేసి, | తత్కథా[3]కర్ణనమున శ్రోత్రములఁ దనిపి,
సతతసంకీర్తనక్రియాచతురుఁ డగుచు | నుండు నెవ్వఁడు, మోక్షంబు నొందు నతఁడు.

154


శా.

హింసా[4]దంభ[5]మదాభిమానరతులై యే కాలము న్మానవుల్
సంసా[6]రోదితపుత్రదారధనవాంఛాసక్తులై, యాత్మలోఁ
గంసారిం దలపోయఁ గాన, కతిదుఃఖప్రాప్తులై, కర్మవి
ధ్వంసోపాయము లేక, యోనిగతులై వర్తింపుచు న్వెళ్లుచున్,

155


క.

దురితానురూపదారుణ | నరకంబుల ననుభవించి, నలఁగి ధరిత్రిన్
దిరుగ జననముల నొందియు | నెఱుఁగరు [7]సదసద్వివేక మించుక యైనన్.

156


సీ.

జననస్థలంబులు చర్చింప దుర్గంధ | చటులమూత్రపురీషసంకులములు,
గాత్రముల్ పరికింప ఘనరక్తమాంసాస్థి | చర్మమేదోరోమనిర్మితములు,
సంచారములుచూడఁ జంచలాత్మకుటుంబ | రక్షణదైన్యదుర్లక్షణములు,
సంసారనిస్సారసౌఖ్యముల్ వివరింప | స్వప్నమిథ్యాభోగసన్నిభములు,


తే.

పట్టఁ బసచాల దిది మేడిపంటిచంద | మని యెఱింగియు, దేహి యత్యంతమోహ
సహితుఁడగుఁ గాని, వైకుంఠసదనమునకుఁ | దెరువు సుజ్ఞాన మనుబుద్ధిఁ దెలియఁ [8]డనఘ!

157
  1. క్షర - మ,మా, తా,హ,క
  2. నొకటేని - తీ
  3. వర్ణన - తా
  4. రంభ - త
  5. మహా - తి, తీ,ర
  6. రోపిత - త
  7. సువివేకభావ - తీ
  8. డకట - తీ