పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

వరాహపురాణము


క.

పుష్యద్గుణునకు, బుధసం | భాష్యునకు, నరేంద్రనీతిపారంగతవై
దుష్యమణిభూషణునకును, | బుష్యరథాఖ్యునకు విదుఁడు పుట్టె మునీంద్రా!

148


సీ.

విదమహీపతి కుద్భవించె సుద్యుమ్నుఁ డా | ధరణీశునకు క్షేమధన్వుఁ డొదవె,
శతబలి వానికి జన్మించె, నన్నరే | శ్వరునకు దమనుండు సంభవించెఁ,
బొడమె శంతనుఁడు తద్భూపాలకునకు, నా | మండలేశునకు భోజుండు పుట్టె
నవతరించెఁ గుశ ధ్వజాఖ్యుఁడా నృపతి, కా | స్వామికిఁ గలిగెఁ గ్రౌంచధ్వజుండు,


తే.

కనియె నాక్షోణిపతి వికర్తనుని, నతని | కాత్మజుండయ్యె సోమదత్తాహ్వయుండు,
తద్ధరావల్లభుఁడు యజ్ఞదత్తుఁ గాంచె, | నుదితుఁడయ్యె మహేంద్రుఁ డాయుత్తమునకు.

149


వ.

అమ్మహేంద్రునకు శరద్వతుండు పుట్టె. ఆరాజచూడామణికి మయూరధ్వజుండు జని
యించె. ఆమయూరధ్వజునకుఁ గుముద్వతియుఁ, బుంజిలయు, నిషధయుఁ, జంద్రరేఖయు
నన నలుగురుభార్యలు గలరు. అందుఁ గుముద్వతికి శృంగవీర్యుండును, బుంజిలకుఁ గృష్ణుం
డును, నిషధకు దాల్బ్యుండును, జంద్రరేఖకు రామసేనుండును నుదయించిరి. అందు,
శృంగవీర్యుండు బ్రహ్మచర్యంబున విప్రత్వం బంగీకరించి, బ్రహ్మలోకంబున కరిగె. తదను
మతంబునఁ గృష్ణుండు సహస్రకాంతాసమేతుఁడై చతురంగబలంబులు గొలువ, భూదేవేం
ద్రుండన రాజ్యంబు నిష్కంటకంబుగా నేలుచుఁ, గుమారసహస్రంబుఁ గాంచె. ఆందు,
వజ్రుండు కోసలాధిపతి యయ్యె; నూర్వురుకుమారులు [1]యోగాభ్యాసపరులై [2]యుత్తమమార్గం
బునకుం జనిరి; మఱియు, నార్నూట[3]పదునొకండుగురు కిరాతులై యరణ్యప్రదేశంబు
చేరిరి; వెండియు నిన్నూటయెనుబదియెనమండ్రుగురుకుమారులు సమబలులై యన్యోన్య
కలహంబునఁ బ్రజాపీడకు లైరి. అంతఁ గలియుగం బాసన్నంబైన,

150


మ.

 ధరణీనాథులు [4]సత్యహీను లగుచున్, దర్పించి దుర్మార్గులై
నిరతంబున్ ధనధాన్యమత్తులగుచు న్నిర్లజ్జులై, మేదినీ
సురవిత్తంబు లపహ్నవింపుచును దేజోహీనులై యున్నచో
హరి కల్క్యాకృతి దాల్చి, తున్ము [5]దురమం దశ్వోత్తమారూఢుఁడై.

151
  1. యోగధ్యాన - మా, తి, తీ
  2. యుక్తధర్మమార్గ - తా
  3. పదునలుగురు - తా కంటె భిన్న ప్ర.
  4. సత్త్వ - తీ
  5. ధరయం - తా