పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

వరాహపురాణము


వ.

ఇట్లు సోమసూర్యవంశోత్పన్నులగు రాజన్యులు కుంచకులు, రాజకులు, గర్తకులు,
సమానకులు నన నాలుగుతెఱంగులవారు గలరు. అందు క్షత్రకన్యకలవలన విప్రుల
కుదయించినవారు కుంచకులును, క్షత్రియకాంతలయందు రాజన్యులకు సంభవించినవారు
రాజకులును, వైశ్యభామల యందు రాజుల కుద్భవించినవారు గర్తకులును, శూద్రాంగనల
యందు క్షత్రియులకుం బుట్టినవారు సమానకులు ననం బరగి, ప్రజాపాలనం బొనర్తురు.
అట్టి భూవరోత్తముల జన్మకర్మప్రకారంబులు గొన్ని చెప్పెద నాకర్ణింపుము.

110

ఇనకులేశుల దివ్యచరితము

సీ.

శ్రీభర్త యాత్మీయనాభిపద్మంబునఁ | [1]జతురాననుండు తా సంభవించె,
నా చతుర్ముఖుని చిత్తాంభోజమునఁ బుట్టె | నధికతేజోనిధి యగు మరీచి,
యా మహామహునకు నౌరసపుత్రుఁడై | జననంబునొందె కశ్యపవిరించి,
యతనికి దక్షకన్యక యైన యదితికిఁ | బ్రభవించెఁ దనయుఁడై భాస్కరుండు,


తే.

సకల సురసేవ్యుఁడై జగచ్చక్షు వగుచు | విమలమూర్తిత్రయాత్ముఁడై వెలయునట్టి
చండకరునకు వైవస్వతుం డనంగ | మనుకులాఢ్యుండు హరిభక్తిధనుఁడు వొడమె.

111


క.

వారిజహితసుతుఁడగు నా | ధీరుఁడు నిర్మించెఁ గర్మదృఢముగ సరయూ
తీరమున సుజనబోధ్యను, | సారసురాసుర[2]బలాద్యసాధ్య నయోధ్యన్.

112


క.

సిరుల, విశాలవధూటీ | స్ఫురణంబున, మధురసరసభోగ్యపదార్థా
కరమహిమ, భోగవతి యనఁ | బొరసెం దత్పురి యనేకపురనామములన్.

113


మ.

హరితేజోనవబీజకంబు, మనువర్యాంకూర, మిక్ష్వాకుబం
ధురకాండంబు, దిలీపముఖ్యనృపతిస్తోమోరుశాఖంబు, దా
శరథి స్వచ్ఛఫలంబు నైన రవివంశస్వర్గభూజంబు, త
త్పురరాజంబను నాలవాలమున నొప్పున్ సద్ద్విజావాసమై.

114


సీ.

తగ మేను దాల్చిన నిగమశాస్త్రంబులు, | మూర్తి పూనిన శౌర్యకీర్తివితతు,
లాకారవంతంబు లైన విత్తములు, రూ | పము వహించినయట్టి పతిహితంబు,
లంగంబు లందిన శృంగారభావంబు | లాకృతి [3]గలుగుకామాగమములు,
తనువు చేపట్టిన దానపాండిత్యంబు, | లసమగాత్రము గల యఖిలవిద్య,

  1. జతురాననుండన - తీ కంటే భిన్న.
  2. బలాఢ్యసాధ్య - అన్ని ప్ర.
  3. గలిగిన యాగమములు - త