పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

164

వరాహపురాణము


తే.

మూఁడునాభుల నైదుకమ్ములఁ దనర్చు | చక్రమును, సప్తనామకాశ్వమును, గుంటి
సారథియుఁ గల్గు తే రెక్కి, సత్వరమున | నప్సరోనాగయక్షసమన్వితముగ,

95


ఆ.

వాలఖిల్యమునులు వర్ణింపఁగా, నిరా | లంబమైనయట్టి యంబరమున
ప్రతిదినంబుఁ దిరుగు భవదీయమహిమంబుఁ | దెలియ నరిది మాకు.ననఘచరిత!

96


క.

దినమును బక్షము మాసం | బును ఋతుపయనమును వర్షములునై కాలం
బనుమింపం బడుచుండుట | యనఘా! నీ యుదయమహిమ నౌనో కాదో?

97


క.

నరు లెవ్వరైనఁ దావక | చరణంబులు గొలిచిరేనిఁ జండాపత్సా
గరము గడచి, యారోగ్య | స్థిరు లగుదురు సకలదివిజసేవ్యచరిత్రా!

98


శా.

ఆకర్ణింపుము విన్నపంబు త్రిజగద్వ్యాపారపారీణ! భూ
లోకంబెల్ల నరాజకంబగుట యాలోకించి, చోరోద్ధతా
నీకంబుల్ గడుబాధ పెట్టఁగ, భయోన్నిద్రాత్ములై [1]భూప్రజల్
శోకంబందుచునున్నవారు దివిజస్తుత్యా! ప్రతాపోజ్జ్వలా!

99


క.

మఖములు సాగకయుండెను, | మఖభోజనవర్ధమానమహులగు బర్హి
ర్ముఖులు, మఖభాగచర్వణ | సుఖవాంఛారహితులైరి సురమునివినుతా!

100


చ.

అతులిత[2]వర్గధర్మనియమాబ్ధికిఁ జెల్లెలికట్ట, సజ్జనా
తతవిపదద్రికిం గులిశధార, చతుఃపురుషార్థశేముషీ
లతికకు నాలవాలము, కులద్విరదంబున కంకుశంబు భూ
పతి, యతఁ డబ్బకుండిన విపర్యయమందు సమస్తకార్యముల్.

101


ఉ.

కావున, రాజసత్తములు గల్గక యుండిన ధాత్రి సుస్థిరీ
భావము నొంద, దాత్మపతిఁ బాసిన భామినియట్లు, దేవతా
సేవితరూప! మామనవి చేకొని తావకగర్భవేశిత
క్ష్మావరకోటిఁ గ్రమ్మఱ నొసంగు మనన్, రవి వారి కిట్లనున్.

102


చ.

మునివరులార! యానృపతిముఖ్యులు మత్కిరణప్రసారసం
జనితమహోష్ణపీడితులు, సారవిహీనులు నౌటఁజేసి, దు
ర్జనరిపు[3]గర్వభంజనము, సర్వమహీపరిపాలనంబు స
జ్జనభజనంబుఁ జేయఁగ నశక్తులు, వీరల వేఁడ నేటికిన్?

103
  1. భూసురుల్ - తీ
  2. వర్ణ - మా, తా
  3. పర - తా,తి, తీ