పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

వరాహపురాణము

యాతనాశరీరధారణము

క.

నానావిధదేహంబులఁ | బూనిన యాజీవులెల్లఁ బుడమిని మృతులై
యానరకంబుల కేవిధ | మైన శరీరములు దాల్చి, యరుగుదు రనఘా?

82


క.

అనవుడు, విజ్ఞానకళా | వననిధి, రోమశుఁడు, వైష్ణవగ్రామణి, యా
మునిశేఖరునకు నిట్లను | ననుపమవాక్పాటవమున కార్యులు మెచ్చన్.

83


సీ.

జీవుఁ డవధ్యుఁ డ[1]చ్ఛేద్యుఁ డక్లేద్యుండు | జన్మజరామృత్యుజాతిరహితుఁ
డంగనాపురుషవేషాదిశూన్యుఁడు నిత్యుం | డచలుండు సర్వగుం డగుచు నుండు,
నతఁ డాత్మకర్మమూలాగతమృగపక్షి | మనుజకీటాదిజన్మములఁ బొంది,
తదనురూపములైన తనువులఫల మాయు | రవసానపర్యంత మనుభవించి,


తే.

పుత్ర[2]దారాదిమోహాంధబుద్ధి యగుచు, | భుక్తినిధువననిద్రాదిసక్తుఁ డగుచు
నల్పసుఖముల బద్ధుఁడై, యంతమీఁదఁ | గాలవశమున మృతిఁ బొంది గాత్ర మెడలి.

84


మ.

యమదూతల్ గొనిపోవఁ, గర్మలయపర్యంతంబు శస్త్రాగ్నిము
ఖ్యములన్ వ్రీలని యాతనాతనువునం దావిష్టుఁడై, భోగ[3]నా
శ్యములం గర్మఫలంబులం గుడిచి, తత్సందర్శితానేకగ
ర్భములం గ్రమ్మఱఁ బుట్టు జీవుఁ డుచితప్రజ్ఞావిహీనాత్ముఁడై.

85

చంద్రసూర్యవంశరాజన్యుల జననప్రకారము

చ.

అనిన, మృకండుసూనుఁడు ప్రియంబున రోమశుతోడ నిట్లనున్,
'మునివర! సూర్యసోమకులముఖ్యనరేంద్రుల జన్మకర్మవ
ర్తనములు సర్వముం దెలియఁ దత్త్వమతి న్వినిపంపు' మన్న, నా
యనఘవరేణ్యుఁ డిట్లనియె నమ్మహనీయున కాదరంబునన్.

86


మ.

హరిబాహాయుగళంబు[4]నం దుదితులై, యత్యంత[5]బాహాఢ్యులై,
ధరణీదుర్భరభారసంభరణవిద్యాదక్షులై సంతత
స్థిరధైర్యోన్నతులై, సమస్తవిభవశ్రీకామినీపూర్ణమం
దిరులై, రాజులు పుట్టి రంబుజసుహృత్తేజో౽భిరామాంగులై.

87
  1. భేద్యు (యతి?) - అన్ని ప్ర.
  2. మోహాది - మ, తా, తి, తీ,హ, ర,క
  3. వాచ్యములం - తా
  4. నన్విదితులై - అన్ని ప్ర.
  5. దానాఢ్యులై - తీ కంటే భిన్న ప్ర.