పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

181


మ.

హరిదాసుల్ పనిపూని యిచ్చటికి దివ్యాకారులై వచ్చిరో?
వరయోగీంద్రులు దివ్యనామము లిట న్వర్ణించిరో? కాక, శ్రీ
వరుఁ డత్యంతదయాభిరాముఁ డగుచున్ వైకుంఠముం జేర్చెనో?
[1]తఱుచై ప్రాణులు లేరు చూడ నరకస్థానంబునం దెయ్యెడన్.

74


వ.

అని పలికిన పితృపతికిఁ గింకరులు కరంబులు మొగిచి యిట్లనిరి.

75


ఉ.

స్వామి! కృతాంత! దండధర! సజ్జనబంధు[2]శరణ్యుఁ, డిందుగా
భూమిసురాగ్రగణ్యుఁ డొకపుణ్యుఁడు వచ్చి, విపన్నమానవ
స్తోమము గాంచి, జాతకృపతో హరిఁ బేర్కొనఁ, దన్ముఖంబునం
దామరసాక్షునామము ముదంబున వీనుల నాలకించుటన్.

76


క.

[3]పాపములఁ బాసి, నరక | స్థాపితులగు జీవులెల్లఁ దత్క్షణమాత్రన్
శ్రీపతిభవనము చేరిన | నీపురి శూన్యత్వగతి వహించె మహాత్మా!

77


వ.

అనిన, కింకరులకు నంతకుం డిట్లనియె.

78


ఉ.

కింకరులార! మీరు పరికింపక శ్రీహరిభక్తుల న్నిరా
తంకత నిట్లుఁ దేఁదగునె? దానన మత్పుర మిట్టిదయ్యె, మీ
కింకొకబుద్ధి చెప్పెద. మహీస్థలి కెన్నఁడు చన్న, వైనతే
యాంకపదారవింద[4]యుగళాత్ముల, భాగవతాగ్రగణ్యులన్.

79


క.

హరిభక్తిపరుల, లక్ష్మీ | శ్వరుసేవాపరుల, విష్ణుచరణార్చనత
త్పరుల, ముకుందగుణస్తుతి | పరులం గని, తొలఁగిపొండు భయరయయుతులై.

80


వ.

అని, వైవస్వతుండు నిజకింకరుల నాజ్ఞాపించి, యంతఃపురంబునకుం జనియె.
శివశర్మయు విష్ణునామప్రభావం బెఱింగి, భూలోకంబునకు వచ్చి, యాత్మశరీరగతుండై,
చతుర్థాశ్రమంబు గైకొని, నారాయణ ధ్యానపరాయణుండై హరిపురప్రాప్తుం డయ్యె నని
చెప్పిన విని, మార్కండేయుండు రోమశున కిట్లనియె.

81
  1. తఱచై - మా
  2. శరణ్య! ముందుగా - తి.తీ; శరణ్యుఁ డెత్తుగా - త; శరణ్యుం డింతలో - తా; శరణ్యుఁ డింపుగా - క
  3. ఈ పద్యమును, దరువాతి వచనమును ర. ప్ర.లో లుప్తము.
  4. నికరాత్ముల - త. కంటె భిన్న ప్ర.