పుట:వరాహపురాణము (హరిభట్టు).pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

వరాహపురాణము


హుతంబులును, దత్తంబులును నగు భోజ్యంబులును, గాలపక్వంబులు, నగ్నిపక్వంబులు,
రసపక్వంబులు నైన యన్నంబులం దృప్తిం బొందుదురు. ఇట్టి పితృలోకంబునకు నుదగ్భా
గంబున.

68


మ.

ప్రతతస్వర్ణమణిప్రభాధగధగత్ప్రాసాదవర్గంబు, నూ
ర్జిత[1]రంభాముఖనిర్జరీబహువిధక్రీడానిసర్గంబు, శో
ధితచింతామణికల్పకామరగవీబృందప్రసూతార్థమం
డితమార్గంబును నైన స్వర్గ మది కంటే? భూసురాగ్రేసరా!

69


చ.

అని వినిపింపఁగా, యమభటాగ్రణివాక్యము లాలకింపుచుం
జని, నికటంబున న్నరకసద్మమునం దనురూపయాతనా
తనువులు దాల్చి, శోకపరితాపమునం బలవించు జీవులం
గని, కరుణాతిరేకమునఁ గర్ణపుటంబులు కేల మూయుచున్.

70

నరకవాసులకుఁ బరమపదప్రాప్తి

క.

నారాయణ నారాయణ | నారాయణ యనుచుఁ బలుక నరకస్థితు లా
నారాయణ నామశ్రుతి | కారణమున విష్ణుపదము గనిరి మునీంద్రా!

71


చ.

హరిపురి కీప్రకారమున నందఱుఁ బోయినఁ, బ్రేతనాథుఁ డా
ర్తరవము లెప్పటట్లు వినరాక, నిజాలయమెల్ల శూన్యతా
గరిమ వహించియుండుటకుఁ గారణముం దెలియంగలేక, య
చ్చెరుపడి యాత్మకింకరులఁ జీరి భయంకరరీతి నిట్లనున్.

72


సీ.

భూరిలోహస్తంభములయందు నేలొకో | కలయంగ ననలంబు లలమికొనవు?
తప్యమానము లగు తైలంబు లేలొకో | భుగభుగధ్వనులతో నెగసిపడవు?
బంధురనరకకూపశతంబు లేలొకో | ప్రకటబీభత్సపూర్ణములు గావు?
[2]శ్వాపదాదిక్రూరజంతువు లేలొకో | పసిగొని నలువంకఁ బరువులిడవు?


తే.

వాఁడిదప్పిన వసిపత్రవనము లేల? | శూలములు మొక్కపోయిన వేల నేఁడు?
వివిధకుజనార్తరవ మేల చెవులఁ బడదు? | పాడువాఱె నిదేల మత్పట్టణంబు?

73
  1. రంగన్ముఖ - తా
  2. జనపదాది - త; ద్వాపదాది (యతి?) - మ,మా,క; చౌపదాది - తి,తీ,హ,ర